టీం ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రిటైర్‌మెంట్ తర్వాత కామెంటేటర్‌గా, క్రికెట్ విశ్లేషకుడిగా పని చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రైనా తన కెరీర్‌లో మరో ముందుడు వేసేందుకు రెడీ అయ్యాడు. క్రికెట్ నేపథ్యంలో రానున్న తమిళ చిత్రంతో అతను అరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమాని డ్రీమ్ నైట్ స్టోరీస్ నిర్మాణ సంస్థ కింద శ్రవణ కుమార్ నిర్మిస్తున్నారు. లోగాన్ ఈ సినిమాకు దర్శకుడు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో రైనా మూవీ ఎంట్రీని ప్రకటించారు.
ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే రైనాను (Suresh Raina) అక్కడి అభిమానులు ‘చిన్న తలా’ అని పిలుస్తారు. అతనికి తమిళనాడుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కాగా, చెన్నైలో జరిగిన కార్యక్రమంలో యువ క్రికెటర్ శివమ్ దూబే నిర్మాణ సంస్థ, లోగోని ఆవిష్కరించాడు. విదేశీ పర్యటనలో ఉన్న రైనా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు సినిమాల్లో నటించారు. విక్రమ్ నటించిన కోబ్రా చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించాడు. డబుల్ ఎక్సెల్ అనే సినిమాలో శిఖర్ ధవన్ అతిథి పాత్రలో కనిపించాడు. శ్రీశాంత్ కూడా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.