నేపాల్ లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి నాయకత్వం వహిస్తారు. ఈ మేరకు జనరల్ జెడ్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. దాదాపు ఐదు వేలమంది యువకులు వర్చువల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.జనరల్ జెడ్ ఆన్ లైన్ లో నిర్వహించిన సమావేశం ప్రధానంగా దేశ అత్యున్నత పదవికి అర్హులైన అభ్యర్థులపై ప్రధానంగా చర్చించింది. ఒకదశలో ఖాట్మండు మేయర్ బాలెన్ షా పట్ల అనుకూలత వ్యక్తమైనా, ఆయనను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతోమెజారిటీ సభ్యులు సుశీల కర్కి పేరుకు మద్దతు తెలిపారని జనరల్ జెడ్ ప్రతినిధి వెల్లడించినట్లు నేపాల్ మీడియా పేర్కొంది. జనరల్ జెడ్ ప్రతినిధులు ముందుగా సుశీల కర్కి ని సంప్రదించగా, కనీసం వెయ్యిమంది తన పేరును సమర్థించిన పక్షంలోనేతాను ఈ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధపడతానని పేర్కొనగా, ఆమె పేరును ప్రతిపాదిస్తూ 2,500 మందికి పైగా యువకులు సంతకాలు చేశారు.సమావేశంలో సుశీల కర్కి పేరుతో పాటు, నేపాల్ విద్యుత్ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘిసింగ్, యువనాయకుడు సాగర్ ధకల్, థరణ్ మేయర్ హర్కా సంపాంగ్ ల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినా సుశీల కర్కి ప్రధానమంత్రి పదవికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.