Tuesday, September 16, 2025

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్..

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ వద్దిరాజు రాకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒక ఒక ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీకి, 18 నెలలుగా ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేరుకుపోయిన బకాయిల వల్ల ఆస్పత్రుల నిర్వహణ తీవ్ర భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో సేవలను కొనసాగించలేమని వివరించారు. వాస్తవానికి సెప్టెంబర్ 1 నుంచే సేవలు నిలిపివేస్తామని గత నెల 21న ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీంతో ఆగస్టు 30న ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఒకటి రెండు రోజుల్లో కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆస్పత్రులు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాయి. అయితే, 15 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇక సేవలు నిలిపివేయక తప్పడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి.

గడిచిన 21 నెలల్లో రూ.1,779 కోట్లు చెల్లించాం : సిఇఒ ఉదయ్ కుమార్
ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సిఇఒ ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, గడిచిన 21 నెలల్లో రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. ప్యాకేజీల చార్జీల పెంపు కోసం ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు దశాబ్దకాలం ఎదురుచూశాయని, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికిపైగా పెంచిన విషయాన్ని సిఇఒ గుర్తు చేశారు.

కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి రోగులకు ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా రూ.487.29 కోట్లు పేషెంట్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకూ సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు రూ.75 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.95 కోట్లు చెల్లిస్తున్నామని, హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు వంద కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఉదయ్ వెల్లడించారు. హాస్పిటల్స్ యాజమాన్యాల ఇతర విజ్ఞప్తుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సేవల నిలిపివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని హాస్పిటళ్ల యాజమాన్యాలకు సిఇఒ విజ్ఞప్తి చేశారు.

Also Read: భర్తపై వేడి నూనె పోసిన భార్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News