- Advertisement -
ఆనందాల మీద అధికారం
కోల్పోయినట్టుంది
సగం గీసి ఆపిన బతుకు చిత్రం
నిర్జీవంగా గోడకు వేలాడుతూ ఉంటుంది
తనువును ఆవరించిన నిస్సత్తువ
ఎప్పటికీ తొలగిపోదు
మనసు మీద కమ్మిన దిగులు మబ్బులు
జ్ఞాపకాల (Memories) తెమ్మెర వీచినప్పుడల్లా
కన్నీటి చినుకులు రాలుస్తూనే ఉంటాయి
గతస్మృతుల నీడలో తచ్చాడే తలపులు
రాటకు కట్టేసిన లేగదూడలా
అక్కడక్కడే తిరుగుతుంటాయి
కలలుకన్న జీవితం, కళ్ళముందే
కరిగిపోగా అతను లేని జీవనం
తెలియని ఊళ్ళో చీకటి రాత్రిలా
భయపెడుతుంది
లెక్క తెలియని రేపటి రోజులు
చెట్టు నీడలేని ఎండదారిలా
మెలికలు తిరుగుతూ
పరుచుకుని ఉంటాయి
గుండె లోతుల్లో దాచుకున్న తీపి గుర్తుల
చెలిమె నుండి ఎన్ని చేదలు తోడిపోసినా
ఎండిపోయిన మనసు కడవ
ఇంతైనా నిండదు
గుండె బరువు కొంతైనా తగ్గదు
బతుకు దాహం తీరనే తీరదు
- సింగరాజు రమాదేవి
- Advertisement -