Monday, September 15, 2025

గొర్రెల స్కామ్‌లో మాజీ మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సంచలనం రేపిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్ కుమార్‌ను ఇడి అధికారులు బుధవారం తమ అదుపులోకి తీసుకున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 700 కోట్ల గొర్రెల పంపిణీ స్కామ్‌లో మనీ లాండరింగ్ జరిగిందన్న ఫిర్యాదులపై ఇడి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ఎనిమిది చోట్ల ఇడి సోదాలు చేపట్టింది. ఈ సోదాలలో కల్యాణ్ ఇంట్లో ఇడి అధికారులు పెద్ద మొత్తంలో నగదు , పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించడానికి నోటు లెక్కింపు మెషీన్లను కూడా వినియోగించారు.

తలసాని శ్రీనివాస్ యాద వ్‌కు కల్యాణ్ కుమార్ ఓఎస్డీగా ఉన్న సమయంలో గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇతర అధికారులు , మధ్యవర్తులతో కలిసి అతను నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గొర్రెలను సబ్సిడీ రేట్లతో అందించింది.అయితే, ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎసిబి దర్యాప్తు చేపట్టింది. వారి ప్రాథమిక దర్యాప్తులో ఈ స్కామ్‌లో దాదాపు రూ. 700 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు వెల్లడైంది. నకిలీ బ్యాంకు ఖాతాలు, షెల్ వెండర్ల ద్వారా నిధులు మళ్లించినట్టు తేలింది.

గొర్రెల కొనుగోలు, రవాణా, పంపిణీలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. ఇన్వాయిస్‌ల నకిలీ తయారీ, గొర్రెలకు ఉపయోగించే ఇయర్ ట్యాగ్‌ల డూప్లికేషన్, రవాణా కోసం అనధికార వాహనాల వినియోగం వంటి అక్రమాలు జరిగాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో వెల్లడయింది. మే 31, 2024న కల్యాణ్ కుమార్‌ను, తెలంగాణ స్టేట్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సిఇఒ సబావత్ రామచందర్‌ను రూ. 2.1 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో ఎసిబి అరెస్టు చేసింది. ఆ కేసులో వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీని అరెస్టు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి తలసానిపై పడింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో తలసాని పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ౦౦౦౦

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News