తొలగింపుల వేళ కంపెనీ అనూహ్య ప్రకటన
న్యూఢిల్లీ: ఉద్యోగుల తొలగింపు వేళ దిగ్గజ ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను సుమారు 4.5 శాతం నుంచి 7 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి రెండు అంకెల పెంపు అంటే 10 శాతం మేరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. వేతనాల పెంపు ఈ నెల అంటే సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానుంది. ఈ నెల చివర్లో జమయ్యే వేతనంలో సవరించిన జీతం ఉద్యోగులకు అందుతుంది.ఈ పెంపు గత కొన్నేళ్లుగా ఇతర ఐటి సంస్థలు అమలు చేసిన ప్రమాణాలతో సమానంగా ఉన్నాయని సంస్థ తెలిపింది. సాధారణంగా టిసిఎస్ ఏప్రిల్‌లో వేతన పెంపులు ప్రకటిస్తుంది. కానీ ఈ సంవత్సరం ప్రతికూల పరిస్థితులు, అనిశ్చితి కారణంగా వాయిదా వేసింది. జూలైలో త్రైమాసిక ఫలితాలను వెల్లడించినప్పుడు కూడా ఇదే విధానాన్ని కొనసాగించింది. కానీ గత నెలలో వేతన పెంపును అధికారికంగా ధృవీకరించింది. టిసిఎస్‌లో ట్రైనీలు వై గ్రేడ్‌లో ఉంటారు. అనంతరం సి1 (సిస్టమ్స్ ఇంజనీర్), తరువాత సి2, సి3 (ఎ, బి), సి4, సి5, సిఎక్స్‌ఒ స్థాయిలు ఉంటాయి.
సాధారణంగా సి3 నుంచే సీనియర్లుగా వర్గీకరిస్తారు. సీనియర్ మేనేజ్‌మెంట్ వర్గానికి వేతన పెంపులపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఏప్రిల్-జూలై మధ్య కాలంలో ఆర్థిక అనిశ్చితి, ధరల ఒత్తిడి కారణంగా పెంపులను నిలిపివేసిన ఐటి సంస్థలు మళ్లీ వేతన పెంపును ప్రారంభించాయి. కాగ్నిజెంట్ కూడా ఇటీవల నవంబర్ 1 నుండి ఎక్కువమంది ఉద్యోగులకు వేతన పెంపులు ఇస్తామని ప్రకటించింది. ఇన్ఫోసిస్ ఇప్పటికే ఈ ఏడాది రెండు విడతల్లో 5 నుంచి -8 శాతం పెంపులు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డబుల్ డిజిట్ పెంపులు ఇచ్చింది. కొంతమందికి జనవరిలో, మరికొందరికి ఏప్రిల్‌లో అ మలు చేసింది. ఇక టిసిఎస్ జూలైలో తన సిబ్బందిలో సుమారు 2 శాతం (12,000 మంది)ని తొలగించింది. దీంతో ముఖ్యంగా మధ్య, సీనియర్ మేనేజర్లు ప్రభావితమయ్యారు. వేగంగా మారుతున్న ఎఐ నైపుణ్యాల అవసరాలకు తగిన ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.