సాధారణంగా క్రికెట్‌లో విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా కొన్ని జట్లు భారీ స్కోర్ సాధిస్తే.. మరోవైపు కొన్ని జట్లు అత్యల్ప స్కోర్‌కి పరిమితమవుతుంటాయి. అయితే ఇలాంటి మ్యాచ్‌ని మాత్రం మీరు గతంలో ఎక్కడ చూసి ఉండరు. 427 పరుగుల లక్ష్య చేధనలో ఓ జట్టు కేవలం 2 పరుగులు (Two Runs Allout) మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ మిడిలెసెక్స్ కౌంటీ లీగ్‌లో ఈ వింత చోటు చేసుకుంది.
ఈ లీగ్‌లో మూడో టైర్ డివిజన్‌లో సోమవారం నార్త్ లండన్ సిసి 3rd XIకి, రిచ్‌మండ్ సిసి 4th XI మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సీసీ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 426 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నార్త్ లండన్ బ్యాటింగ్‌లో డాన్ సిమ్మన్స్ (140) శతకం సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన రిచ్‌మండ్ సిసి ఆరంభం నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. పరుగులు చేయకుండానే బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాటపట్టారు. దీంతో రిచ్‌మండ్ 5.4 ఓవర్లలో 2 పరుగులకే (Two Runs Allout) ఆలౌటైంది.
నార్త్ లండన్ బౌలింగ్‌లో మాథ్యూ రాన్సన్ 5 వికెట్ల పడగొట్టగా.. థామస్ పాటన్ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. రిచ్‌మండ్ బ్యాటర్లలో 9 మంది డకౌట్ అయ్యారు. చివరి బ్యాటర్ విక్రమ్ మంగళూరు బ్యాటింగ్‌కి రాలేదు. దీంతో రిచ్‌మండ్ 2 పరుగులకే ఆలౌట్ అయింది. అందులో ఒకటి వైడ్ కావడం గమనార్హం. దీంతో నార్త్ లండన్ 424 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్ కిందకు రానుందన ఈ చెత్త రికార్డును పరిగణలోకి తీసుకోలేదు.