హైదరాబాద్: ఆసియా కప్ కోసం టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. ప్రస్తుతం భారత జట్టు కూర్పుపై విదేశీ ఆటగాళ్లు చేస్తున్న కామెంట్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండిపడ్డారు. భారత జట్టు కూర్పుపై విదేశీ ఆటగాళ్లు కామెంట్లు చేయడం మంచిది కాదని హితువు పలికారు. ఇతర దేశాల జట్ల వ్యవహారాల్లో భారత ఆటగాళ్లు ఎప్పుడూ కామెంట్లు చేయలేదన్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్, జైస్వాల్ లాంటి వారికి చోటులేకపోవడంతో ఎబి డివిలియర్స్ లాంటి ఆటగాళ్లు విమర్శలు చేశారు.
శ్రేయస్‌ను తీసుకోవాల్సి ఉండేదని ఎబి వ్యాఖ్యలను గావస్కర్ తప్పు పట్టాడు. భారత జట్టు ఎంపిక విదేశీ ఆటగాళ్ల పని కాదు అని చురకలంటించారు. వాళ్ల దేశపు క్రికెట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. భారత క్రికెట్‌పై తక్కువ జ్ఞానం ఉన్నవారు మాత్రమే కామెంట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విదేశీ జట్లకు ఆటగాళ్లను ప్రకటించినప్పుడు మన దేశపు ఆటగాళ్లు ఎప్పుడూ కామెంట్లు చేయలేదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం పొందాలనే లక్ష్యంతోనే విదేశీ ఆటగాళ్లు టీమిండియాను లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.