మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసి పెను సంచలనం సృష్టించింది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత్‌కు సిరీస్‌లో ఇబ్బందులు ఖాయమని విశ్లేషకులు సయితం ఓ అంచనాకు వచ్చారు. అనుకున్నట్టే తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఒత్తిడిని తట్టుకోలేక ఓటమి పాలైంది. 373 పరుగుల భారీ లక్ష్యాన్ని సయితం కాపాడుకోవడంలో భారత్ విఫలమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా పరాజయం చవిచూసింది. ఈ ప్రదర్శన తర్వాత భారత్ సిరీస్‌లో పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు.
కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ రికార్డు విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాను ముందుండి నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనకు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, రిషబ్, కెఎల్ రాహుల్‌లు కూడా తమవంతు సహకారం అందించడంతో బర్మింగ్‌హామ్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. అయితే లార్డ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ మళ్లీ తడబాటుకు గురైంది. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో వికెట్లను చేజార్చుకుని భారీ ఆధిక్యాన్ని అవకాశాన్ని చేజార్చుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వ జైస్వాల్, కరుణ్‌నాయర్, నితీశ్ రెడ్డితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లు విఫలమయ్యారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. సిరాజ్, బుమ్రాలు రెండేసి వికెట్లను పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే కుప్పకూలింది.
అయితే ఇంగ్లండ్ ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేక పోయింది. ఓపెనర్ యశస్వి వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశ పరిచాడు. కరుణ్ నాయర్ తన పేలవమైన ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా జట్టును ఆదుకోలేక పోయాడు. నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు కూడా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియాను గెలిపించేందుకు సర్వం ఒడ్డాడు. అయితే ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక టీమిండియా 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆతిథ్య టీమ్ 22 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇక మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా మ్యాచ్‌ను డ్రాగా ముగించి ఔరా అనిపించింది.
తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు వెనుకబడిన టీమిండియాకు ఈ మ్యాచ్‌లో ఓటమి ఖాయమే అనిపించింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఖాతా తెరవకుండానే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. రాహుల్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కానీ కెప్టెన్ గిల్ శతకంతో అలరించాడు. అయితే రాహుల్, గిల్‌లు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. కానీ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు పెను సంచలనమే సృష్టించారు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సుందర్, జడేజాలు అజేయ శతకాలతో చెలరేగి పోయారు. దీంతో ఓటమి పాలవుతుందని భావించిన టీమిండియా మ్యాచ్‌ను డ్రాగా ముగించి ఔరా అనిపించింది.
ఇక ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో అసాధారణ పోరాట పటిమతో అనూహ్యం విజయాన్ని అందుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్‌లు బంతితో చెలరేగడంతో భారత్ చిరస్మరణీయ విజయం సాధించి సిరీస్‌ను డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ శతకం సాధించగా, వాషింగ్టన్, జడేజాలు మరోసారి కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. ఆకాశ్‌దీప్ కూడా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఒత్తిడిని సయితం తట్టుకుంటూ చారిత్రక ప్రదర్శనతో అలరించారు. దీంతో ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని సాధించి సిరీస్‌ను డ్రాగా ముగించింది. ఈ ప్రదర్శన టీమిండియాలో కొత్త జోష్ నింపిందనే చెప్పాలి. రానున్న సిరీస్‌లలో మరింత మెరుగ్గా ఆడేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.