ఈ మధ్యకాలంలో ఎయిర్ ఇండియా విమానాలు (Air India Flight) తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానాల్లో లోపాలు బయటపడుతున్నాయి. కొన్ని విమానాలు తృటిలో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నాయి. సోమవారం ఓ విమానం ముంబై విమానాశ్రయంలో అదుపు తప్పగా.. మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఓ విమానంలో మంటలు చెలరేగాయి. తాజాగా మరో విమానం సాంకేతిక లోపంతో ఎక్కడ నుంచి టేకాఫ్ అయిందో.. తిరిగి అక్కడే ల్యాండ్ అయింది.
కేరళలోని కాలికట్ నుంచి దోహాకు వెళ్లాల్సిన విమానంలో (Air India Flight) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అది బయల్దేరిన చోటనే తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఉన్న ఎయిర్ ఇండియా ఐఎక్స్ 375 ఉదయం తొమ్మిది గంటల సమయంలో కాలికట్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. దాని క్యాబిన్ ఎసిలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 11 గంటల సమయంలో టేకాఫ్ అయిన చోటే మళ్లీ ల్యాండ్ చేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలు చేర్చుందుకు ప్రత్యమ్నాయ ఏర్పాటు చేస్తామని చెప్పారు.