పోక్రాన్‌లో 1998లో జయప్రదంగా జరిపిన అణు పరీక్షలు నిర్వహించిన మే 11వ తేదీనే ప్రతి సంవత్సరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ సూచనలతో మన దేశంలో ‘జాతీయ సాంకేతికత దినోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) గా జరుపుకుంటారు. ఆదిమానవుడి నుంచి నేటి ఆధునిక మానవుడుగా అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం ‘చదువు’. పూర్వకాలంలో ముఖ్యంగా మన దేశంలో చదువు కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితి. ముఖ్యంగా జ్యోతి రావు ఫూలే, సావిత్రి బాయ్ ఫూలే, అంబేద్కర్ వంటి ఎందరో సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ద్వారా అందరికీ కనీసం పదవ తరగతి వరకూ చదువుకునే అవకాశం లభించింది.
అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాల పూర్తి అవుతున్నా అందరికీ సమానమైన, నాణ్యమైన ఉన్నత, సాంకేతిక విద్య అందరికీ అందుబాటులో లేదు అనే విషయాన్ని మరువకూడదు. ఇక ఏమిటి, ఎందుకు, ఎలా? అనే ప్రశ్నలు ఉద్భవించడం ద్వారానే నేడు ఈ సమాజం ఇంత అందంగా, ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా మారింది అని గ్రహించాలి. ముఖ్యంగా దేశంలో చదువు ద్వారానే సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను దూరం చేయడం జరుగుతున్నది. కుల మత వర్గ లింగ వివక్షలు అణచివేతకు చదువు సాధనంగా మారింది. అయినప్పటికీ నేటికీ వివిధ రకాల రాజకీయ, ఆర్థిక, సామాజిక, వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి అనే విషయాన్ని మరువకూడదు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం సంభవించిన తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ప్రజల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువులు, పరిశోధనలు ఊపందుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, మెడిసిన్ పరిశోధనలు, అంతరిక్ష పరిశోధన వంటివి రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా దేశంలో స్వాతంత్య్రం అనంతరం వ్యవసాయ, పారిశ్రామిక, అంతరిక్ష, అణుశక్తి, మెడిసిన్ వంటి రంగాల్లో అభివృద్ధి, పరిశోధనలు పుంజుకున్నాయి. హరిత విప్లవంద్వారా ఆహార ఉత్పత్తులు పెరిగాయి. నూతన సాంకేతికతను ఉపయోగించి అనేక నిర్మాణాలు, డ్యాంలు, భవనాలు, ఆనకట్టలు, రైల్వేలైన్లు ముఖ్యంగా ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్ లో పర్వతాలు మధ్య నిర్మించిన అతి ఎత్తైనా రైల్వే వంతెన, అలాగే రామేశ్వరంలో సముద్రంలో నిర్మించిన వంతెన భారతీయ సాంకేతికతలో సాధించిన అద్భుతమైన విజయాలుగా చెప్పుకోవచ్చు.
అలాగే ఇటీవల కాలంలో ప్రపంచాన్ని వణికించిన ‘కరోనా వైరస్’ నియంత్రణకు మన దేశంలో అతి తక్కువ సమయంలో కనుగొన్న ‘వ్యాక్సిన్’ భారతదేశం మెడిసిన్ రంగంలో సాధించిన మరో అద్భుతమైన విజయంగా చెప్పవచ్చు. ఇక అంతరిక్షంలో ‘ఇస్రో’ చరిత్ర సృష్టిస్తుంది. చంద్రయాన్, ఆదిత్య వంటి ప్రాజెక్టులు విజయ దుందుభి మోగిస్తున్నాయి. అంతేకాకుండా ఇతర దేశాల రాకెట్లు కూడా మన దేశంలో నుంచే ప్రయోగిస్తూ విదేశీ మారకద్రవ్యం ఆర్జించడం జరుగుతున్నది. అయితే ఇటీవల పాలకులు విద్యా రంగాన్ని ప్రైవేటీకరణ, చరిత్రను తిరగరాసే ప్రయత్నాలు, విద్యా రంగంలో కాషాయీకరణ, మతక్రతువులు, కుంభమేళా వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆందోళన కలిగిస్తోంది.
అలాగే ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ నియామకాల్లో మత సంబంధమైన వ్యక్తులను నియమించడం జరుగుతున్నది. నిష్ణాతులైన, నిపుణులైన అధ్యాపకులను 21వ శతాబ్దానికి అవసరమైన విద్య, వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిలబస్ ప్రవేశపెట్టాలి. పరిశోధనలకు బడ్జెట్ కేటాయింపులు చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలు, లేబరేటరీ వంటి సదుపాయాలు అన్ని పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేయాలి. ఖాళీగాఉన్న పోస్టులను, అధ్యాపకులను వెంటనే నియమించాలి. మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు పెంచే సిలబస్, విధానాలు విడనాడాలి. త్వరలో దేశం నుంచి ‘నోబెల్ బహుమతి’ అందుకునే విధంగా పరిశోధకులు మారాలి.
పరిశోధనలు, పేటెంట్ రైట్స్ సాధించాలి. అనేక శతాబ్దాలుగా, భారతదేశంలో ఉన్న అనేక వివక్షలు కనుమరుగు అవడానికి కారణం చదువు, సాంకేతిక పరిజ్ఞానం. ఈ రోజు మన దేశం నుంచే లక్షల మంది ‘సాప్ట్ వేర్’ ఇంజినర్లు విదేశాల్లో అనేక అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. సుందర్ పిచాయ్ వంటి ఎందరో అంతర్జాతీయ సంస్థలకు సిఇఒలుగా పని చేయడం జరుగుతున్నది. సునీత విలియమ్స్ వ్యోమగామి దేశమూలాలకు చెందిన వారే అని గ్రహించాలి. ఇటీవల కాలంలో దేశంలో తిరోగమన విధానాలు అమలులోకి వస్తున్నాయి. ఈ విషయాలు ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ ప్రమేయం పెరుగుతుంది. యుజిసి, అనేక కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, మతపరమైన అంశాలు పెరుగుతున్నాయి. ఇటువంటి ధోరణులు శ్రేయోస్కరం కాదు. ఆరు అంగుళాల సెల్ ఫోన్‌తో మొత్తం ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది.
టివి, కంప్యూటర్, లాప్‌టాప్, టాబ్లెట్ వంటి అనేక పనిముట్లు, గాడ్జెట్లు అందుబాటులోకి రావడం మానవ జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది అంటే కారణం సాంకేతికత. మన దేశంలో దాదాపు జనాభాకు అనుగుణంగా సెల్ ఫోన్లు ఉన్నాయి అంటే అతిశయోక్తికాదు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అన్నింటా డిజిటల్ రూపం సంతరించుకొంది. ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆర్థిక లావాదేవీలు పుంజుకున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలు, అమేజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ద్వారా ఇంటి వద్ద నుండే అనేక సౌకర్యాలు లభిస్తున్నాయి అంటే కారణం సాంకేతికత అనే విషయాన్ని మరువకూడదు. వైద్య రంగంలో రోబెటిక్స్ పాత్ర పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భారత్‌లో అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అందరికీ అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో అందరూ, సమానంగా అభివృద్ధి సాధించాలంటే అందరికీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- ఐ. ప్రసాదరావు
9948272919 ( జాతీయ సాంకేతికత దినోత్సవం)