హైదరాబాద్: మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మల్లన్న గన్ మెన్లు గాల్లో కాల్పులు జరిపారు. అయితే ఈ దాడిపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కవిత, ఆమె కుటుంబం హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి గాయమైందని.. తన గన్‌మెన్ నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లో మల్లన్న (Teenmaar Mallanna) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ తరహా దాడులతో బిసిలను, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మేం చేసే ప్రయత్నం కొంచెం కూడా తగ్గదు. ఇలాంటి వాటికి నేను భయపడను. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. రాసి పెట్టుకోండి.. రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసిల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మేం సలహాలు ఇస్తున్నాం. పొరపాట్లు జరిగితే ప్రభుత్వం సరి చేసుకుంటోంది. ఈ విషయంలో కవితకు ఎందుకు బాధ. ఉనికి కోసం అయితే కెసిఆర్‌ను అడగాలి. కెసిఆర్, కెటిఆర్‌పై ఉన్న కోపం మాపై చూపిస్తామంటే ఎలా? ఇలాంటి దాడులతో ప్రజల్లో చులకన అవుతారు. సహచర ఎమ్మెల్సీపై దాడులకు ప్రేరేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’’ అని అన్నారు.