ఎంఎల్‌సి కవిత, ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి తెగబడిందని ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఇలాంటి చర్యలతో బిసి ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది భ్రమే అని చెప్పారు. ఉనికి కోసం అయితే కెసిఆర్‌ను అడగాలని సూచించారు. కెసిఆర్, కెటిఆర్‌పై ఉన్న ఫ్రస్ట్రేషన్ తమపై చూపిస్తామంటే కుదరదని చెప్పారు. మేడిపల్లిలోని తన కార్యాలయంపై తన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడిపై ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంఎల్‌సి కవిత అనుచరుల దాడిలో తన చేతికి గాయమైందని. తన గన్‌మెన్ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించారని చెప్పారు. ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బిసిలు, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఇసుమంత కూడా
తగ్గదు అని, మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామని వెల్లడించారు. ఇలాంటి వాటికి తాను భయపడను అని పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి.. రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది అంటూ ఎంఎల్‌సి కవిత ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బిసిల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై తాము పోరాడుతుంటే కవితకు ఎందుకు బాధ…? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మా సలహాలను స్వీకరిస్తోందని, పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటోందని తెలిపారు. ఇలాంటి దాడులతో మరింత దిగజారి ప్రజల్లో చులకన కావడం తప్ప ఇంకేమీ ఉండదన్నారు. సహచర ఎంఎల్‌సిపై దాడులకు ప్రేరేపించిన కవిత ఎంఎల్‌సి సభ్యత్వాన్ని రద్దు చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.