వైద్య పర్యాటక పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు
సిఎం రేవంత్‌రెడ్డి సూచనతో…. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్‌లకు
మెడికల్ టూరిజంపై పరిచయ కార్యక్రమం
ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ
మెడికల్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ
16న తెలంగాణ మెడికల్ టూరిజంపై పరిచయం
-ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విదేశీ
హెల్త్ టూరిస్ట్‌లను ఆకర్షించడమే లక్ష్యం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు, సాంకేతికత, సామర్థ్యం కలిగిన వైద్యులు, ఉన్నత నాణ్యతైన చికిత్సలను అందిస్తూ ఇప్పటికే తెలంగాణ అంతర్జాతీయ రోగులను ఆకర్షిస్తుండగా…మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ వైద్య పర్యాటక పటంలో తెలంగాణ ప్రముఖ కేంద్రంగా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకాల మేరకు 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే…150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే మిస్ వరల్డ్ ఈవెంట్‌లో మెడికల్ టూరిజంను ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సిఎం రేవంత్ రెడ్డి సూచనతో… తెలంగాణలో తక్కువ ఖర్చుతో అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలను,మెడికల్ టూరిజంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని తెలియజేసేలా మిస్ వరల్డ్ కాంటెస్టెంట్‌లకు ఈ నెల 16వ తేదీన నగరంలోని ఎఐజి హాస్పిటల్‌లో అధికారులు ప్రత్యేకంగా మెడికల్ టూరిజం ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
ఖర్చు తక్కువ…. ప్రభావవంతమైన చికిత్సలు
అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే తెలంగాణలో చికిత్స ఖర్చులు 60 నుంచి -80 శాతం తక్కువ. దాదాపు శతాబ్ద కాలంగా వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రి, అపోలో హాస్పిటల్స్, యశోదా హాస్పిటల్స్, అపోలో కాంటినెంటల్ హాస్పిటల్స్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులు అత్యాధునిక సాంకేతికత (రోబోటిక్ సర్జరీ, టెలిమెడిసిన్), మల్టీస్పెషాలిటీ కేంద్రాలతో….కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, క్యాన్సర్ చికిత్స, ట్రాన్స్‌ప్లాంటేషన్, కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ,ఫెర్టిలిటీ చికిత్సలు (ఐవిఎఫ్), అవయవ మార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియలకు నిపుణులైన వైద్యులతో సమర్ధవంతమైన చికిత్స అందిస్తున్నారు. అమెరికా తదితర పాశ్చాత్య దేశాలలో హార్ట్ సర్జరీకి, బై పాస్ సర్జరీ ఒక లక్ష డాలర్లు అవుతుండగా హైదరాబాద్‌లో మాత్రం కేవలం 5 వేల డాలర్ల నుండి 10 వేల డాలర్లు మాత్రమే ఖర్చు అవుతున్నాయి.
అదేవిధంగా, మోకాలు మార్పిడి శస్త్రచికిత్సకు పాశ్చాత్య దేశాలలో 40 వేల నుండి 60 వేల డాలర్లు అవుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం ఐదు వేల డాలర్ల లోపే ఖర్చవుతుంది. దంత సమస్యలకు విదేశాలలో ఐదు వేల డాలర్లు అవుతుండగా మన దగ్గర వెయ్యి డాలర్లలోపే ఖర్చవుతోంది. అందుకే విదేశాల నుండి వైద్య అవసరాలకు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు. పైగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అనేక ఆసుపత్రులు అత్యుత్తమ వైద్య చికిత్సగా గుర్తింపుగా భావించే జెసిజె (జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్), ఎన్‌ఎబిహెచ్ అక్రెడిటేషన్లను సాధించాయి. ఇది రోగుల నమ్మకాన్ని మరింతగా పెంచింది. ఆధునిక వైద్యంతో పాటూ భారత సంప్రదాయ వైద్య విధానాల పట్ల విదేశీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ వైద్య విధానాలైనా ఆయుర్వేద, హోమియో, యునానిపై కూడా ప్రచారం నిర్వహించేందుకు, వాటి ప్రయోజనాలను తెలిపేందుకు, తద్వారా భారత సంప్రదాయ వైద్య సేవలను విదేశీయులకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
మెడికల్ హెల్త్ టూరిస్ట్‌లను ఆకర్షిస్తున్న అంశాలు ఇవే
తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన చికిత్సలు, అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, నిపుణులు, కనీస నిరీక్షణ సమయాలు, ఇంగ్లీష్ మాట్లాడే సిబ్బంది, కమ్యూనికేషన్ సౌలభ్యం, ప్రభుత్వ మద్దతు, వైద్య వీసా (ఇ-వీసా), స్నేహపూర్వక వాతావరణం, కనెక్టివిటీ, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఫలితంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం నుండి రోగులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీనివల్ల తెలంగాణలో మెడికల్ టూరిజం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.
రెండు రెట్లు పెరిగిన విదేశీ హెల్త్ టూరిస్టులు
2014 సంవత్సరంలో 75 వేల 171 మంది విదేశీ విదేశీ హెల్త్ టూరిస్టులు వైద్య సేవలు పొందేందుకు హైదరాబాద్‌కు రాగా… 2024 సంవత్సరం వరకూ దశాబ్ద కాలంలో 1 లక్షా 55 వేల 313 మంది విదేశీయులు వచ్చారు. అదే సమయంలో 2024 సంవత్సరంలో 8 కోట్ల 82 లక్షల 39 వేల 675 మంది రోగులు దేశంలోనీ వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం తెలంగాణకు వచ్చారు. ఇప్పటికే మెడికల్ టూరిజంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉండగా, మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణతో మెడికల్ టూరిజంలో తెలంగాణను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.