రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 30న ప్రారంభమం కానున్నాయి. అయితే ఈ నెల 29న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించాలి ? అనేది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను సభలో ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలన్న అంశంపైనా చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగే అవకాశం లేకపోలేదు.
బిఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్ రావు సభకు హాజరవుతారా? అనే చర్చ కూడా రాజకీయ పార్టీలు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెసిఆర్ సభకు హాజరైతే కాళేశ్వరంపై చాలా లోతుగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాళేశ్వరం నిర్మాణం వల్ల లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందుతున్నదని, కెసిఆర్ అభినవ భగరీధుడు అని బిఆర్‌ఎస్ నాయకులు పొగుడుతుండగా, మేడిగడ్డ కుంగుబాటు, కోట్లాది రూపాయల దుర్వినియోగం, అవినీతి జరిగిందని అధికార పార్టీ ఇప్పటికే ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడి— వేడిగా జరిగే అవకాశం ఉంది.