Monday, September 8, 2025

వెనుకబాటును అధిగమించాల్సిన బాధ్యత తెలంగావాదులదే

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అస్తిత్వం.. సృజన రంగం

ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలుపెట్టాం. అందులో భాగంగా ఈసారి సీనియర్ పాత్రికేయుడు, సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్ట్, కవి, విమర్శకుడు, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు, కె.శ్రీనివాస్ అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్‌లో..

తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి?

తెలంగాణ అస్తిత్వం అంటే, తెలంగాణకు చెంది ఉండడమే. ఒక కులంలోనో, మతంలోనో, తెగలో నో, సాంస్కృతిక ధోరణిలోనే పుట్టి ఉంటే ఆయా అస్తిత్వాలు జన్మతః సంక్రమిస్తాయి. అట్లాగే, జన్మతః తెలంగాణీయులు కావడం అన్నది ఒక ప్రాథమిక ప్రాతిపదిక. ప్రాంతాల మధ్య మనుషుల వలసలు ఉంటాయి కాబట్టి, సామాజిక అస్తిత్వాల మాదిరి ప్రాంతీయ అస్తిత్వం ఒక స్థిర, శాశ్వత అస్తిత్వంగా కనిపించదు. ఒక కచ్ఛితమైన స్థల, కాల పరిధిని నిర్వచించగలమని ఇప్పటికీ అనుకోలేను. తెలంగాణ అస్తిత్వ చైతన్యం బాధిత, వివక్షిత స్థితి నుంచి వికసించింది కాబట్టి, కోస్తాం ధ్ర ప్రాంతం నుంచి జరిగిన వివిధ దశల వలసలకు ముందు నుంచి తెలంగాణలో ఉంటున్నవారందరిదీ తెలంగాణ అస్తిత్వమే అని స్థూలంగా చెప్పుకోవచ్చు.
అస్తిత్వం వేరు. అస్తిత్వ చైతన్యం వేరు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, నైసర్గిక, సామాజిక విభిన్నతలు, ప్రత్యేకతలు, వాటి రకరకాల వ్యక్తీకరణ లూ, సాముదాయిక స్మృతి సంపుటులూ, వనరులపై, విధానాలపై స్వయం నిర్ణయాధికార ఆకాంక్షలు- ఇవన్నీ తెలంగాణ అస్తిత్వ చైతన్యంలో భాగం. తన చారిత్రక, వర్తమాన లక్షణాలుగా సంభావించుకున్న ఉమ్మడి వ్యక్తిత్వ విశేషాలు కూడా అస్తిత్వ చైతన్యంలో భాగమే.

Also Read: ఉరుమురిమి హరీశ్‌పైనా?

సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో ఆ అస్తిత్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?

ఉద్యమ కాలంలో, సాహిత్య, సాంస్కృతిక రంగా ల్లో అస్తిత్వ చైతన్యం ప్రభావవంతంగా, ప్రతిఫలించింది. నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఈ రంగాల నుంచి కీలకమైన, నిరంతరమైన దోహదం అందింది. ఉద్యమ సారథ్యంలో సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కూడా సమాన భాగస్వామ్యం ఉన్నది. రాష్ట్రం ఏర్పాటు తరువాత, పరిస్థితి అట్లా కొనసాగిందని చెప్పలేము.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిం దా? ఎలాంటి నూతన మార్పులు జరిగా యని అనుకుంటున్నారు?

జరగవలసినంత జరగలేదు. కొన్ని పార్శ్వాలలో అసలు ఏమీ జరగలేదు. తెలంగాణ అవతరణ తరువాత మొదటి పది సంవత్సరాల కాలంలో, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోని ఉద్యమ కృషిని స్థిరపరచడం, ఈ రంగాలలో వ్యక్తమైన ప్రత్యేకమైన ఆకాంక్షలను పరిపూర్తి చేయడం, రాష్ట్ర నవ నిర్మాణంలో విమర్శనాత్మక పాత్ర పోషించడం వంటి కర్తవ్యాలేవీ ముందుకు సాగలేదు.

అస్తిత్వ చైతన్యం నిరంతరంగా ఉద్యమకాలం నాటి స్థితిలోనే కొనసాగుతుందని ఆశించలేము. తెలంగాణవాదులకు ప్రాం తీయ న్యాయంతో పాటు, సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాలకు సంబంధించిన ఆకాంక్షలు కూడా ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై, వివిధ అభివృద్ధి ధోరణులపై, విధానాలపై, సిద్ధాంతాలపై అవగాహనలుంటాయి. తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని తక్కిన వాటితో సృజనాత్మకంగా మేళవించుకుంటూ ముందుకు సాగాలి. తెలంగాణవాదులు అనేకులు మతతత్వానికి వ్యతిరేకంగా, పౌరహక్కుల అణచివేతను నిరసిస్తూ, ఇంకా అనేక రంగాల సమస్యలకు స్పందిస్తూ పనిచేసిన వారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించినంత మంది సాహిత్య, సామాజికరంగ కార్యకర్తలు అనంతర కాలంలో కనిపించరు. తక్కిన అస్తిత్వాలు ఇంకా పోరాట దశలోనే ఉండగా, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్ష నెరవేరింది. విజయం తరువాత ఉద్యమం నిలబడడం కష్టం. అందువల్ల కూడా అనంతర కర్తవ్యాల నిర్వహణలో తటపటాయిం పు, మందకొడితనం కనిపిస్తుంది.

మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితు ల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగంలో, ఎంతో వేగవంతంగా, వివిధ రకాల సంస్కృతుల కలగ లుపు జరుగుతున్న స్థితి ఉంది. తెలంగాణా స్వీ య అస్తిత్వేతర సంస్కృతులు, సాహిత్య, కళా రంగాల నుండి మంచిని తెలుసుకోవడం, నేర్చు కోవడం, తమ సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమనుకుంటున్నారా?
పైన ప్రస్తావించినట్టు, తెలంగాణ అస్తిత్వ చైతన్యం సొంతంగా అభివృద్ధి చెందుతూనే, ఇతర సామాజిక, రాజకీయ చైతన్యాలతో మేళవించుకుని ముందుకు సాగాలి. అలాగే, ఇతర భాషా సంస్కృతుల నుంచి, ఇతర ప్రాంత తెలుగు సంస్కృతుల నుంచి, జాతీయ, అంతర్జాతీయ సాహిత్య కళాధోరణుల నుంచి నేర్చుకుంటూనే ఉండాలి. ప్రభావితం చేస్తూ, ప్రభావితం అవుతూ ఉండాలి. ప్రాంతీ యఅస్తిత్వం అన్నది ప్రాంతానికే పరిమితం కావడం కాదు. ఒక నేల మీద నిలబడి ప్రపంచాన్ని చూడడం, తెలుసుకోవడం. ఎంత ఎత్తున ఎగిరినా, చూపు తన నేల మీదనే నిలుపుకోవడం.

తెలంగాణా అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం ఒక సాంస్కృతిక విధానా న్ని రూపొందించుకోవాలి. బి.నర్సింగరావు గారు ఒక నమూనా రూపొందించారు. దాన్ని చర్చించి, ప్రభుత్వం ఆమోదించాలి. అట్లాగే, భాష, సాహిత్య విధానాలను కూడా ప్రకటించాలి. తెలంగాణ భాష మీద అధ్యయనం, క్రోడీకరణ కృషి జరగాలి. మీడియాలో, పుస్తకాలలో వాడే ‘ప్రమాణ’ తెలుగులో తెలంగాణ పదజాలం భాగస్వామ్యం పెంచాలి.

అయితే, అస్తిత్వ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదు. ఉద్యమం ఏరు దాటాక, పాలకులకు ఇక భాష అక్కర్లేదు, అస్తిత్వమూ అ క్కర్లేదు. సాహిత్య, సాంస్కృతిక పౌరసమాజమే ప్రధాన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఆ ప్రయత్నం పెద్దగా జరిగిందని చెప్పలేం. ఆవేశ, ఉద్వేగాలకు సంబంధించి స్పందించినంత వేగంగా, ఆసక్తిగా, ఆలోచన, అవగాహనలకు సంబంధించి సంసిద్ధత కనబడడం లేదు. ఈ వెనుకబాటుకు ఎవరినీ నిందించలేము. దానిని అధిగమించవలసిన బాధ్యత తెలంగాణవాదులదే.

కె.శ్రీనివాస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News