బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లు సైబర్ క్రైం సెంట్రల్ జోన్ డిసిపికి బుధవారం ఫిర్యాదు చేశారు. కొందరు తన పేరుతో ఫేక్ అకౌంట్ రన్ చేస్తున్నారని, దీంతో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాఖకు బిజెపి తెలంగాణ పేరుతో ఫేస్‌బుక్ ఉందన్నారు. ఈ విధంగానే తెలంగాణ బిజెపి పేరుతో కొత్త ఖాతా ఏర్పాటు చేసి అందులో అభ్యంతరకరమైన, తప్పుడు విషయాలు పోస్ట్ చేస్తున్నారని రామచందర్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టుల వల్ల పార్టీ కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు.
తన పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే అధికారిక ఖాతాను బాక్ల్ చేశామని అయినా, ఫేక్ ఖాతా ఇంకా నిర్వహణలో ఉందని ఆయన చెప్పారు. ఈ ఫేక్ ఖాతా వల్ల బిజెపి పార్టీతో పాటు వ్యక్తిగతంగా తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన ఖాతాను ఎవరు హ్యాక్ చేశారో, ఫేక్ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారో త్వరగా తెలుసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిసిపికి విజ్ఞప్తి చేశారు.