లోకల్ బాడీ ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం స్కీం,
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లు, మెడికల్ కాలేజీల స్థితిగతులు, డ్రగ్స్ నియంత్రణ
తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 10వ తేదీన కేబినెట్ భేటీ జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది.
వీటితో పాటు రాజీవ్ యువ వికాసం స్కీం, బనకచర్ల అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి, అడ్మిషన్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లు, మెడికల్ కాలేజీల స్థితిగతులు, డ్రగ్స్ నియంత్రణ, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు ఈ వర్షాకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్టుగా సమాచారం.
అలాగే ఇతర సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ జరిగే చాన్స్ ఉందని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లపై మరోసారి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ప్రతినెలా రెండు సార్లు షెడ్యూల్ ప్రకారం కేబినెట్ భేటీని జరపాలని గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తర్వాత మంత్రివర్గ భేటీ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించిన ఎజెండాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.