మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నాం రెండుగంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. విధానపరమైన అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నేడు కేబినెట్ భేటీని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలు జరుగుతున్నాయా లేదా అమలు చేయకపోతే కారణమేంటి, కారకులు ఎవరన్న అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంత్రివర్గ భేటీలు జరిగ్గా వాటిలో 327 నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఎన్ని అమలయ్యా యి, వాటి కార్యాచరణ ఎలా ఉందన్న అంశంపై నేడు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రత్యేక ఎజెండాగా చర్చించనున్నట్లు తెలిసింది.
ఈనెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ
వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌డిఎస్‌ఏ నిపుణుల కమిటీ సమర్పించిన తుది నివేదికపై మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. దీని ఆధారంగా బరాజ్ పునరుద్ధరణకు తదుపరి కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ఈనెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపై కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. దీంతోపాటు స్థానిక ఎన్నికల నిర్వహణ, స్టాంపుల చట్ట సవరణ బిల్లును మంత్రివర్గం ఆమోదించనున్నట్టుగా తెలిసింది. గోశాలల నిర్మాణాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.