Monday, September 8, 2025

నేడు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత
15 కామారెడ్డి బహిరంగ సభపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కమిటీలు, జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణ, ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పోరేషన్ల చైర్మన్లు హాజరుకానున్నారు. ఇదిలాఉండగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచనతో నాయకత్వం ఉంది.

అయితే పెండింగ్‌లో ఉన్న అన్ని పోస్టులను మొత్తం ఒకేసారి ఇవ్వకుండా దశల వారీగా ఇవ్వాలని నేతలు భావిస్తున్నారు. ఒకేసారి ఇచ్చినట్లయితే, పదవులు రాని వారు నిరుత్సాహంతో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయకుండా తప్పించుకునే అవకాశం లేకపోలేదన్నది వారి అభిమతం. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపైనా చర్చించనున్నారు. లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బిసి రిజర్వేషన్ల కోసం లోగడ కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ ప్రకటించినందున, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే బిసి రిజర్వేషన్లను చట్ట పరంగా ఇవ్వలేకపోయినా, పార్టీ పరంగా ఇస్తామని హామీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రాహుల్‌కూ ఆహ్వానం
కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని పార్టీ రాష్ట్ర ఎంపిలు ఆహ్వానించారు. ఇణకా ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖఆర్జున ఖర్గేను, ఏఐసిసి నాయకుడు కెసి వేణుగోపాల్‌ను తదితరులను ఆహ్వానించారు. స్థానిక సంస్థల సమరంలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సంపాదించడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, వారంతా తమతోనే ఉన్నారని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.

Also Read: ట్రిపుల్ ఆర్ రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: రాజగోపాల్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News