ప్రభుత్వాల నుండి ప్రయోజనాలను ఆశించేవారు ఎంత ఘనాపాటి వక్తలైనా, విషయ పరిజ్ఞానులైనా సరయిన మార్గ నిర్దేశన చేయలేరు. వారు బందీలు. అందుకే కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడి జారుకుం టున్నారు. వారెంత గౌరవనీయులైనా వారి తరం ముగి సింది. ఒక్కొక్కరు నలభై, యాభై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. యువకులుగా చేరి వృద్ధులుగా ఇంకా కొనసాగుతున్నారు. మానసికంగా, శారీరకంగా వారి శక్తులుడగడం కూడా సహజమే. కార్యాచరణలో వయసు ప్రభావం తప్పకుండా ఉంటుంది. పెద్దలు కూడా ఈ విషయాన్నీ దొడ్డ మనసుతో అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం తెలంగాణలోని రచయితలు, కళాకారులు, మేధావులు మూడు విభాగాలుగా కనబడుతున్నారు. అందరూ రాష్ట్ర సాధన ఉద్యమానికి చిత్తశుద్ధితో మద్దతుగా నిలవడమో లేదా అందులో పాల్గొనడమో చేసినవారే.అయితే తెలంగాణలో స్వీయ పాలన మొదలయ్యాక ప్రభుత్వాలు వీరిని పట్టించుకున్న విధానాన్ని బట్టి వీరిలో వర్గాలు ఏర్పడ్డాయి. కెసిఆర్ పాలనలో ఆయన చేత చేరదీయబడ్డవారి వర్గం ఒకటైతే, రేవంత్ రెడ్డి కూడబెట్టుకుంటున్నవారి గ్రూప్ మరొకటి. ఈ రెంటికి చెందకుండా, ఏ ప్రభుత్వాన్ని ఇష్టపడని లేదా ప్రభుత్వాలు పట్టించుకోనివారు కొందరు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ వర్గాలన్నీ కలగాపులగం అయిపోయాయి. కొత్తగా కాంగ్రెస్ భక్త మండలి ఒకటి ఏర్పడింది. మరోవైపు కెసిఆర్ భజనపరుల్లో రెండు చీలికలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వానికి కరుడుకట్టిన మద్దతుదారులను వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం గోడ మీది పిల్లులను బుట్టలో వేసుకుంది. మొత్తానికి తెలంగాణలో ప్రముఖ రచయిత, కళాకారుడు లేదా మేధావి అని ముద్ర పడినవారు చిన్నదో, పెద్దదో ప్రభుత్వ మర్యాదను అందుకున్నారు. అందుకే పూర్తిగా ప్రజాపక్షం వైపు నిలబడి ప్రభుత్వాలను నిలదీసేవారి కొరత ఇప్పుడు ఎక్కువైంది.
రాష్ట్రంలో వివిధ ప్రజా సంస్థలు, సంఘాలు రకరకాల సమస్యలపై సభలు, సమావేశాలు నిర్వహించడం ఎప్పుడూ జరుగుతున్నదే. సాధారణంగా వాటికి ప్రజాస్వామ్యవాదులు, సామాజికవేత్తలు హాజరవుతుంటారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అవసరాలు, ప్రయోజనాల దృష్టితో అంశప్రధానంగా వీటిలో పాల్గొంటూ ఉంటారు. కెసిఆర్ పాలనలో రాష్ట్ర ప్రజల సమస్యలపై ఏర్పాటైన ఇలాంటి మీటింగులకు మెజారిటీ కవులు, కళాకారులు దూరంగా ఉండేవారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని స్వామిభక్తిని ప్రదర్శించినవారు కూడా ఉన్నారు.
అయితే ఈ మధ్య వీరంతా అంటే కెసిఆర్, రేవంత్ మరియు తటస్థ వర్గ సభ్యులు అందరూ ఒకే వేదికపై కనబడుతున్నారు. సమస్యపై ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా అందరూ కలిసి ముక్తకంఠంలో ఖండిస్తున్నారు. ఎవరిని ఎవరూ తప్పు పట్టడం లేదు. తమను పెద్ద మనిషిగా భావించి పిలిచిన సభకు భంగం రాకుండా చూసుకుంటున్నారు. అందరూ ఒకరికొకరు మంచి పరిచయాలు ఉన్నవారు అయినందున వేదికపై చర్చల్లో వైరుధ్యాలు రానివ్వడం లేదు. అందరూ లబ్ధిదారులే, అంటే ఒకే గూటి పక్షులే. వారంతా సమకాలికులు, సహచరులు కాబట్టి సభలో ములాఖత్ సంతోషమే ఎక్కువ. పిచ్చాపాటి ముచ్చట్లతో గడపడమే తప్ప ఎవరిలోనూ సభా సందర్భంపై సీరియస్ నెస్ కనబడదు. అయితే ప్రజల్లో వీరికి గుర్తింపు ఉండడం, వీరంతా సీనియర్లు, వక్తలుగా సమర్థులు కావడం వల్ల సభలు జరిపేవారికి వీరే అవసరం. వీరి రాక వల్ల మీడియా ఫుల్ కవరేజ్. సభ సక్సెస్. ఫలితం నిల్. అయినా నిర్వాహకులు వాళ్లనే ఏరి మరీ పిలుస్తున్నారు.
వీరి వల్ల సమస్యలపై జరగాల్సినంత చర్చ, వాటి పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. ప్రభుత్వాల నుండి ప్రయోజనాలను ఆశించేవారు ఎంత ఘనాపాటి వక్తలైనా, విషయ పరిజ్ఞానులైనా సరయిన మార్గ నిర్దేశన చేయలేరు. వారు బందీలు. అందుకే కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడి జారుకుంటున్నారు. వారెంత గౌరవనీయులైనా వారి తరం ముగిసింది. ఒక్కొక్కరు నలభై, యాభై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. యువకులుగా చేరి వృద్ధులుగా ఇంకా కొనసాగుతున్నారు. మానసికంగా, శారీరకంగా వారి శక్తులుడగడం కూడా సహజమే. కార్యాచరణలో వయసు ప్రభావం తప్పకుండా ఉంటుంది. పెద్దలు కూడా ఈ విషయాన్నీ దొడ్డ మనసుతో అర్థం చేసుకోవాలి. వారి స్థానంలోకి కొత్త తరం రావాలి. వేదికలపై వక్తలుగా రాణించే కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలి. నేటి సీనియర్లు ఆనాటి యువకులు కాబట్టే ఎన్నో విజయాలను సాధించారు. ఇప్పుడైనా యువకులకు అవకాశం ఇవ్వాలి. యువత సొంత ఆలోచనలతో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలను నిలదీసే మార్గంలో నడవాలి.
ప్రభుత్వాలను నిలదీసే, ప్రజావ్యతిరేక చర్యలను నిలువరించే కార్యాచరణ ఎన్నడు కూడా బలహీనపడకూడదు. అందుకోసం సామాజిక ఉద్యమాలు ఏ కాలంలోనైనా అవసరమే. వాటిని యువకులే నిర్మించారు, వారే నడిపించారు. వాటి కోసం నిరంతరం శ్రమించారు, తెగించారు, త్యాగాలు చేశారు, మార్పును సాధించారు. వీరికి మార్గనిర్దేశనం చేసిన పెద్దలు కూడా ధీరోదాత్తులు, త్యాగధనులు. సమీప గతంలో అధ్యాపక వృత్తిలో ఉన్నవారు విద్యార్థులను ప్రగతిశీల మార్గంలో నడిపించేవారు. ఇప్పుడు అటువంటివారు లేరనే చెప్పాలి. సొంత ప్రయోజనాల కోసం మౌనం వహించే పెద్దరికం వల్ల అపారమైన నష్టం జరుగుతుంది. యువత నిర్వీర్యం అవుతుంది. ప్రభుత్వాలకు ఎదురు లేకుండాపోతుంది. ముప్పయేళ్లవారి వర్తమాన ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలపై సమాజం నిర్మించబడాలి. దాని కోసం ప్రభుత్వాల ముందు మెడలు వంచేవారు కాకుండా ప్రభుత్వం మెడలు వంచేవారి అవసరముంది.
బద్రి నర్సన్ 94401 28169