హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చర్చకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం తెలంగాణ, ఎపి సిఎంలు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి తెలంగాణ సర్కార్ (Telangana Government) లేఖ రాసింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఎపి సింగిల్ ఎజెండా ఇచ్చింది. అయితే రేపటి భేటీలో బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. కృష్ణాపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను ప్రభుత్వం అజెండాగా ప్రతిపాదించింది.
పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయహోదాను ప్రభుత్వం (Telangana Government) అజెండాగా పంపించింది. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని ప్రభుత్వం కోరింది. 200 టిఎెంసిల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టిఎంసిలు కేటాయించాలని పేర్కొంది. బనకచర్లపై జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి, ఇఎసి, అభ్యంతారాలు తెలిపాయని ప్రభుత్వం తెలిపింది. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో ప్రస్తావించింది. బనకచర్ల విషయంలో చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని, ఆ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరమే లేదని తెలంగాణ సర్కార్ పేర్కొంది. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకుపై చర్చించడం అనుచితమని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి చర్యలు కేంద్ర నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయంది.