Friday, September 5, 2025

జాగృతిలో చీలిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థలో చీలిక ఏ ర్పడింది. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత పార్టీకి, ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేసిన 24 గంటలు తిరగకముందే ఆమెకు మరో షాక్ తగిలింది. ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థ నిట్టనిలువునా చీలిపోయింది. అసలు జాగృతి తమదే అని, తమ వల్లనే ఇంతకాలం సంస్థ ఈ స్థాయికి ఎదిగిందని కవిత మొదటి నుంచి అత్యంత స న్నిహితంగా ఉన్నవాళ్లే ఎదురుతిరిగారు. ఈ మేరకు గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతిలో ఇంతకాలం కీలకంగా పనిచేసిన మేడే రాజీవ్ సాగర్, మఠం భిక్షపతి,
రాజారాం యాదవ్, కొదారి శ్రీను సహా పలువురు ముఖ్య నేతలు ఎంఎల్‌సి కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాము కవితతో నడవడం లేదని ప్రకటించారు. తామంతా కెసిఆర్ వెంటే ఉన్నామని తేల్చిచెప్పారు. ఏళ్ల తరబడి జాగృతి కోసం పనిచేసిన తమతో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఏకపక్షంగా కవిత తన సొంత ఎజెండాతో పనిచేస్తున్నారని మండిపడ్డారు. కవిత తీసుకున్న నిర్ణయం వల్ల తమ జీవితాలన్నీ రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తామంతా బిఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న తెలంగాణ జాగృతిలో పని చేశామని చెప్పారు. తెలంగాణ జాగృతిపై కవితకు ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందని అన్నారు. అందువల్లనే తాము జాగృతి ఫోటో పెట్టుకుని మాట్లాడుతున్నామని తెలిపారు. తాము కూడా తెలంగాణ జాగృతి పేరుతోనే పని చేస్తామని, అయితే తామంతా కెసిఆర్ కోసం పని చేస్తామని వెల్లడించారు.

కవిత వెనక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా..?
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కోసమే తెలంగాణ జాగృతికి పని చేశామని మేడే రాజీవ్ సాగర్ తేల్చిచెప్పారు. 19 ఏండ్లు తమను అన్ని రకాల వినియోగించుకుని, ఇప్పుడు రోడ్డున పడేశారని ఎంఎల్‌సి కవితపై రాజీవ్ సాగర్ నిప్పులు చెరిగారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుండి తాము తెలంగాణ జాగృతికి దూరం అయ్యామని తెలిపారు. కవిత లేఖ రాసినప్పటి నుండే కెసిఆర్‌కు ఆమె వ్యతిరేకం అయ్యారని, అప్పటి నుండే తాము జాగృతిని దూరం పెట్టామని చెప్పారు. జాగృతి నాయకులం ఎప్పుడూ కెసిఆర్ కోసమే పని చేస్తామని కెసిఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పని చేసిన ఎంతో మంది జీవితాలు ఏం అవ్వాలి..? అని ప్రశ్నించారు.

19 సంవత్సరాలు పని చేసిన వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి..? అని అడిగారు. కవిత సామాజిక న్యాయం అని అంటున్నారు.. ఆమెకు 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎంఎల్‌సి అవకాశాలు వచ్చాయని, కానీ కవిత వెనక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా..? అని నిలదీశారు. తాము బిఆర్‌ఎస్ కోసం పని చేసే తెలంగాణ జాగృతి నాయకులం అని రాజీవ్ సాగర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా కెసిఆర్ కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తామని తేల్చిచెప్పారు. కెసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కెసిఆర్ కోసం, బిఆర్‌ఎస్ పార్టీ కోసం పని చేసే తెలంగాణ జాగృతి.. ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు..ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారు…? అని కవితను మేడే రాజీవ్ సాగర్ నిలదీశారు.

కెసిఆర్ ఉన్నారు కాబట్టే మేము జాగృతికి పని చేశాం
ఇన్నాళ్లు కవితను కుర్చీపై ఉంచి తాము కింద ఉండి పని చేశామని, ఆమె ఏ పిలుపు ఇచ్చినా రాత్రింబవళ్లు సక్సెస్ చేశామని మేడే రాజీవ్ సాగర్ అన్నారు. కెసిఆర్ ఉన్నారు కాబట్టే తామంతా తెలంగాణ జాగృతికి పని చేశామని తెలిపారు. ఆమె చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్లిన తమను ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు.కవిత మాటను నమ్మి ఆమె వెంట 18 ఏళ్లుగా అనేక మంది నడిచారని, వారందరి జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. మఠం భిక్షపతి మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా కవితతో ప్రయాణం చేసిన తాము ఇవాళ బరువెక్కిన గుండెలతో మాట్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాక్షసపాలన సాగుతోందని మండిపడ్డారు. ఈ పాలన పోయి మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో కెసిఆర్ వెన్నంటే ఉంటూ ఉద్యమాలు చేయాల్సిన కవిత.. కాంగ్రెస్, బిజెపికి ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్న ఆమె తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.

అనేక సందర్భాల్లో పస్తులుండి ఆమె చెప్పిన పనులు చేశామని… కానీ, ఇప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండానే సొంత ఎజెండాతో నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఏనాడైనా తమ బాగోగులు కనుకున్నారా..?అని కవితను నిలదీశారు. ఇప్పటికీ అనేక మంది తెలంగాణ జాగృతి నేతలు ఇళ్లలో పూట గడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ఆమె తమకు ఇచ్చే గుర్తింపు..? అని ప్రశ్నించారు.కవిత వెంట తీసుకువెళ్తున్నది తెలంగాణ జాగృతి కాదు అని, అది కాంగ్రెస్ జాగృతి అని ఆరోపించారు. ఈ వేదికపై ఉన్నదే అసలైన తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత వ్యాఖ్యలు చేస్తే కవితపై ఎలాంటి విమర్శలు చేయవద్దని ఆమె తమ ఇంటి ఆడబిడ్డ అని శ్రేణులకు హరీష్ రావు చెప్పారని, అందుకు తానే సజీవ సాక్ష్యం అని చెప్పారు.

హరీష్ రావు పార్టీని లాక్కోవాలని చూస్తున్నారని కవిత అంటున్నారని, కానీ ఆయన మాత్రం మనమంతా కెసిఆర్ కోసమే పని చేయాలని కార్యకర్తలందరికీ అనేక సందర్భాల్లో చెప్పారని తెలిపారు. హరీష్ రావు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారని, నాలుగు నెలల క్రితం కవితనే ఓ మీడియాతో చెప్పారని గుర్తు చేశారు. అంటే నాలుగు నెలల క్రితం చెప్పిన మాటలు అబద్దమా.. లేక తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దమా..? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News