Wednesday, September 17, 2025

మేధావులారా.. మీరెక్కడ?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున పండుగ చేసుకోలేదు. నిజాం పాలన నుండి వారు బయట పడ్డారో లేదో ఆంధ్రుల పెత్తనంలోకి జారిపోయారు. మళ్ళీ ఇది ఇంకో రకం బాంచ బతుకు. అందుకే స్వరాష్ట్రం అనేది వారికి ఒక మహా అద్భుతం. అంతకు మించి ఏమి వద్దనుకున్నారు. రాష్ట్రం వస్తే చాలు అన్నీ సర్దుకుంటాయి. మా హైదరాబాద్, మా నిధులు, నీళ్లు మాకే దక్కితేచాలు. ఇక ఎలాంటి బాధలు ఉండవు. నిజాం గోస పోయింది, ఇక ఆంధ్ర పీడ కూడా పోతే మాకేం తక్కువ, చదువుకున్న పిల్లలకు కొలువులొస్తాయి. పంటలకు నీళ్ళస్తాయి. అప్పులు, ఆత్మహత్యలు పోయి గరిసెల నిండా ధాన్యరాశులుంటాయి. ఇదీ తెలంగాణ ప్రజలు కన్న స్వరాష్ట్ర కలకు రూపం. అందుకోసం రాష్ట్రం తెచ్చి పెడతామన్న ప్రతి ఒక్కరి వెంటా తిరిగారు. తెలంగాణ తెస్తానన్న మర్రి చెన్నారెడ్డి మాట నమ్మి 1971 సాధారణ ఎన్నికల్లో 11లో 10 స్థానాలను ఆయన పార్టీకి పూలలో పెట్టి అందించారు. ఏడాది తిరగక ముందే చెన్నారెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపి తెలంగాణ ప్రజలకు తీరని నమ్మకద్రోహం చేశారు. ఇప్పటికీ ఆయన్ని తిట్టుకుంటారు. ఆ తర్వాత 2001 కెసిఆర్ కొత్త ఆశలు కల్పించారు. ఆయన పాలక టిడిపి నుండి అసంతృప్తితో బయటికి వచ్చారు. చంద్రబాబును దెబ్బ కొట్టాలనుకున్నారు. ఆయనదొక రాజకీయ ఎత్తుగడే. తెలంగాణ వారికి సొంత రాష్ట్రం కావాలి. తొలి అడుగు నుంచే కెసిఆర్ మాటలు, ప్రసంగాలు వారికి నచ్చాయి. ఎక్కడైనా మైకులోంచి ఆయన మాట వస్తే అక్కడే నిలబడిపోయి వినేవారు.

కెసిఆర్ సభలకు ప్రజలు రావడంతో అన్ని వర్గాలు ఒకే ఆశతో ఆయనకు తోడయ్యాయి. ప్రజల తీవ్రమైన ఆకాంక్షకు ఆయన రాజకీయ చతురత, ఓపిక, పట్టుదల తోడై 2014లో రాష్ట్రం సాకారమైంది. భౌగోళిక తెలంగాణ ఏర్పడింది. ఇక్కడి నేతలకు కూడా అదే కావాలి. కొత్త రాష్ట్రంలో తామే ముఖ్యమంత్రి కావచ్చు. మనోడే సిఎం అయితే మనం మంత్రులు కావచ్చు. ఏ పార్టీకి జనం ఓట్లేసినా ఇక్కడి లీడర్లే లాభపడేది. ఆ లీడర్లు ఎవరు? అదే కాంగ్రెస్ వాళ్లు, అదే టిడిపి వాళ్లు. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమంలో పాల్గొన్న మేధావి, కార్మిక వర్గాలను, యువతను కెసిఆర్ దూరం పెట్టారు. తెలంగాణ కల కన్న అసలుసిసలైన సామాన్యులెవరూ పాలనలో భాగం కాలేదు. వీళ్ళందరూ అసెంబ్లీకి వస్తే తన పెత్తనం సాగదు. భవిష్యత్తులో నాయకులుగా ఎదుగుతారు. వారి సంఖ్య పెరిగితే, వారికి ప్రజాభిమానం లభిస్తే పార్టీ వారి చేతుల్లోకిపోయే అవకాశం కూడా ఉంది. తన శ్రమ అంతా తన కుటుంబానికే దక్కాలన్న ఆయన స్వార్థం తెలంగాణ ప్రజలకు తీరని నష్టమే చేసింది. కెసిఆర్ పాలన అంతా సొంత వర్గాలకు, పార్టీ మనుషులకు లాభదాయంగా సాగింది. పాలక, అధికార వర్గాల్లో అవినీతి పెరిగిపోయింది.

ఇదంతా ఆయనకు తెలియకుండా జరగలేదని జనం పూర్తిగా నమ్మారు. ఆయనపై ప్రజలకు ఉన్న అసహనాన్ని, కోపాన్ని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తెలివిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా తిప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చడం కూడా సాధ్యంకాని పని. ఇప్పటికే అమలు చేశామన్న వాటిలో నిజాయితీ లోపించింది. ఏదో వైపు ప్రజల దృష్టి మళ్లిస్తూ కాలం గడపాలి. మళ్ళీ ఎన్నికలనాటికి కొత్త కథలు చెప్పాలి. ఇది కాంగ్రెస్ పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌పై జనం ఆశలు కోల్పోతే ఆ అవకాశాన్ని బిజెపి వాడుకుంటుంది. ఇక్కడి నుండి ఎనిమిదిమంది బిజెపివారు పార్లమెంట్‌కు వెళ్లడం వారి గెలుపు కన్న మిగతా రెండు పార్టీల వైఫల్యాన్ని సూచిస్తుంది. రాబోయే రోజుల్లో బిజెపి సొంతంగా ఉట్టిని కొట్టలేకపోతే కెసిఆర్ ఊతం ఇవ్వొచ్చు. అంటే తెలంగాణ బతుకులు ఈ మూడు పార్టీల చుట్టే తిరుగుతాయి. నమ్మి మోసపోయామని ఒకరి మీద కోపంతో ఇంకొకరికి ఓటేస్తూ కాలం గడపాలన్నమాట. మరో దారి కూడా లేదు.

Also Read: వలసదారులకు నో ఎంట్రీ

ఓటరు కన్నా బుద్ధిజీవి ఆలోచన వేరుగా ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలని, ప్రజాద్రోహాన్ని చూస్తూ ఊరుకోకుండా ప్రశ్నించే జ్ఞానం, తెగువ వారికుంటుంది. ఈ నేలపై సామాజిక స్పృహ మెండుగా ఉన్న మేధావులు, ప్రజాఉద్యమకారులకు కొదవలేదు. వీరు ఇప్పుడు రూటు మార్చి ప్రభుత్వాల పంచనచేరడం చారిత్రిక తప్పిదం. తెలంగాణలోని ప్రజాస్వామ్య, మేధావి వర్గాలు గతంలో ఎలా వ్యవహరించాయో ఒకసారి గుర్తు చేసుకోవాలి. పూర్తిగా ప్రజాపక్షం వహించి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీసేవి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే ఆందోళనలు చేపట్టేవి. రైతు, మహిళా, నిరుద్యోగుల సమస్యలపై పోరాడేవి. ఎప్పుడు ఏదో సమస్యపై బిజీగా ఉంటూ సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు నిజానిజాలు తేటపరిచేవారు. మేధావులు మరిచిపోయిన తమ గురుతర బాధ్యతలను మళ్లీ చేపట్టవలసిన అవసరం వచ్చింది.

Also Read:జిఎస్‌టి కొత్త శ్లాబులు.. కమలానికి కలిసొచ్చేనా!

బద్రి నర్సన్, 94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News