రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా సాధ్యమేనన్న నగ్నసత్యం అందరికీ తెలిసిందే. నిన్న, మొన్నటి వరకూ కారాలు, మిరియాలు నూరి పోసుకున్న వారు తెల్లారే సరికి ఒక్కటై ప్రజలకు షాక్ ఇవ్వడం పరిపాటే. శతృపక్షాలు మిత్రపక్షాలుగా మారిపోవడం, ఘాటైన పదజాలంతో కత్తులు దూసుకున్న వారు సైతం చట్టాపట్టాలేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయ్యో అని ముక్కు మీద వేలేసుకోవడం ప్రజలవంతైతే రాజకీయాల్లో ఇది సహజమేనని నేతలు తేలిగ్గా చెప్పేస్తారు. కొన్ని పార్టీలైతే కలిసి పోటీ చేయడం, కొన్నాళ్ళకు విడిపోవడం ఎన్నికల సమయంలో మళ్లీ కలిసి పోటీ చేయడం జరుగుతూనే ఉంది. కలిసి పోటీ చేసి పెద్ద తప్పే చేశాం అని పైకి చెప్పిన వారే మళ్లీ ఎన్నికల నాటికి ఒక్కటి కావడం చూస్తూనే ఉన్నాం. అలాంటి కోవకు చెందిన పార్టీలే బిజెపి.. టిడిపి.
ఎన్.టి. రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలూ కలవడం, విడిపోవడం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో టిడిపి,(TDP Andhra Pradesh) బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ రెండు కళ్ళ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు. తనకు రెండు కళ్ళూ సమానమేనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలోనూ కూటమి దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయా? అనే సందేహాలూ రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో కలిసి పోటీ చేసినట్లు తెలంగాణలోనూ కలిసి పోటీ చేసేందుకు ఏ మేరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న అంశమూ చర్చనీయాంశమే. ఆంధ్రలో పని చేసిన మూడు పార్టీల యుగళ గీతం తెలంగాణలోనూ పని చేస్తుందా? మూడు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేస్తే అధికార కాంగ్రెస్‌ను, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టడం సాధ్యం కాదు.
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సుమారు మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కూటమి కోసం కసరత్తు చేయడం ఎందుకూ? అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తేనే ఎంత బలంగా ఉన్నాం, ఎక్కడ బలహీనంగా ఉన్నాం, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ? అనే అంచనాకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాగా, కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేసే విషయంలో బిజెపి నేతల్లో భిన్న స్వరాలు లేకపోలేదు. ఆ ఆలోచన చేయాల్సిన అవసరం లేదని, సొంతంగా పోటీ చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం పలువురు సీనయర్లలో ఉంది. వారికి ఆ అభిప్రాయం ఉండడానికి కారణం ఉంది.
గతంలోనూ అంటే 1999 సంవత్సరం ఎన్నికల్లో బిజెపికి దేశ వ్యాప్తంగా కార్గిల్ యుద్ధంతో ప్రభంజనంలా గాలి వీచినా దానిని బిజెపి వాడుకోలేకపోయింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇదే మంచి సమయమని భావించి బిజెపి ‘ఢిల్లీ పెద్ద’లతో మంతనాలు జరిపి మిత్రపక్షంగా మారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో బిజెపికి పొత్తులో భాగంగా 25 సీట్లు ఇస్తే ఆ పార్టీ 12 సీట్లలో అభ్యర్థులను గెలిపించుకున్నది. ఇప్పుడు తెలంగాణలో బలపడుతున్న సమయంలో మళ్లీ పొత్తు అనో, కూటమిగా జత కడితే బలపడకపోగా బలహీనపడతామేమోనన్న భయం ఒకవైపు, దీంతో కాంగ్రెస్ లేదా టిఆర్‌ఎస్‌కు మేలు జరుగుతుందేమోనన్న అనుమానం మరోవైపు నేతలను కలవరపరుస్తున్నది.
ఆ భయానికి, కలవరానికి అర్థం ఉంది. టిడిపితో జత కడితే ఆంధ్ర నాయకత్వం ఉన్న పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడినట్లు అవతలి పార్టీలు , ముఖ్యంగా బిఆర్‌ఎస్ నేతలు ‘తెలంగాణపై ఆంధ్ర పెద్దల పెత్తనం’ అంటూ సెంటిమెంట్ లేవదీసే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అన్నది వారి అంతర్మథనం. ఒకవేళ కలిసి పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేస్తే మూడు పార్టీలూ నష్టపోతాయన్నది మరో లెక్క. ఇదంతా చర్చ, తర్జనభర్జన ఎందుకూ? స్థానిక సంస్థల ఎన్నికలనే సెమి ఫైనల్స్‌గా భావించి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే ఫలితాలను బట్టి ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నాటికి ఆలోచన చేయవచ్చన్న భావన ఉంది. కూటమిగా ఏర్పడితే నష్టం అని, ఒంటరిగా పోటీ చేసి ఎనిమిది లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నామన్న ధీమా బిజెపి కొంత మందికి ఉన్నా, అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఈ శక్తి సరిపోదన్న భావన లేకపోలేదు. అసలే బిసిల అంశం ప్రధానంగా ముందున్నది.
ఈ సమయంలో బిజెపికి రథసారధిగా బ్రాహ్మణుడైన రామచందర్ రావుకు అప్పగించింది.పొత్తుల విషయంలో బిజెపి జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోదని, రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా పొత్తు కుదుర్చుకోవాలన్నది వారి అభిమతం. మహారాష్ట్రలో బిజెపిశివసేన మధ్య పొత్తు ఉన్నా, తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు లేదు, పైగా శివసేన ఉనికి, ప్రాబల్యం ఏమీ లేదు. ఇక పొత్తుల విషయానికి వస్తే బిజెపి రాష్ట్ర నాయకత్వం చేతుల్లో ఏమీ ఉండదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తలచుకుంటే ఏకంగా బిజెపి అగ్రనాయకత్వంతో చర్చించి ఒప్పించడం పెద్ద విషయమేమీ కాదు. ఒంటరిగా పోటీ చేస్తామని బిజెపి రాష్ట్ర నాయకత్వం కోరుకున్నా, అధిష్టానం ఆదేశం శిరోధార్యం. చంద్రబాబు నాయుడు-తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిల మధ్య గురుశిష్యుల బంధం కాబట్టి చంద్రబాబు అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచి చూద్దాం.
- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి