బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రజలు ఇళ్ల
నుంచి బయటకు రావొద్దు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హెచ్చరిక వివిధ విభాగాల అధికారులకు సెలవులు రద్దు
ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సర్కార్
ఆదేశాలు ములుగు, నల్గొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు
మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో అత్యధికంగా 23 సెం.మీల
వర్షపాతం పొంగిపొర్లుతున్న వాగులు..వంకలు, పలుచోట్ల
రాకపోకలకు అంతరాయం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి
తొమ్మిది విమానాల దారి మళ్లింపు ప్రాజెక్టులకు పోటెత్తుతున్న
వరద శ్రీశైలం ఏడుగేట్లు, నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తి
దిగువకు నీటి విడుదల సంగారెడ్డి, మెదక్, వికారాబాద్
జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతం లో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జి ల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూ పాలప్లలి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.హైదరాబాద్,హనుమకొండ,ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురంభీం, ఆసిఫాబాద్,మహబూబాబాద్, మంచిర్యాల, న ల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అ తి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.రాష్ట్రమంతటా గురువారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారు.
పశ్చిమ- మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆయా శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అన్ని విభాగాల్లో పనిచేసే అధికారులకు సెలవురు రద్దు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులల్లో ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో పై సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాలువలు, చెరువుల, వాగులు, ఇతర ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు నిఘా ఉండాలని అధికారులకు సూచించారు. పాలనా పరమైన అనుమతుల కోసం వేచి చూడకుండా వేగంగా పనిచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో అన్ని శాఖలత అధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల ఎటుంవంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటించింది.
ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు
ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ములుగు జిల్లాకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర్ ముందస్తుగా అప్రమత్తత చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పొలాలు నీట మునిగాయి. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో అత్యధికంగా 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తాండూరులోని రైల్వే అండర్ వంతెన నీట మునిగింది. ముందస్తు జాగ్రత్తగా రైల్వే గేటును అధికారులు మూసివేశారు. భీమిని మండలం పెద్దపేట, రాజారం మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. చిన్న తిమ్మాపూర్ వద్ద ఎర్రవాగు ఉప్పొంగింది. మరోవైపు నల్లవాగు ఉప్పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి.
వాగు ఉదృతితో నిలిచిన రాకపోకలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షం దంచికొడుతోంది. దీంతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిర్యాని మండలం మాణిక్యపూర్ వాగు ఉద్ధృతికి రాకపోకలు నిలిచాయి. ఆసిఫాబాద్‌లోని సందీప్‌నగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్‌లో కురిసిన భారీ వర్షాల వరద ముంపు నుంచి కాలనీవాసులు తేరుకుంటున్నారు. మైసయ్యనగర్, డీకేనగర్, ఎన్టీఆర్ నగర్, శివనగర్ కాలనీల్లో వరగ కాస్త తగ్గుముఖం పట్టింది. వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి కాలనీ వాసులు ఇంటికి చేరుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా ఎటు చూసినా జలసంద్రంగా మారింది. అలాగే మంచిర్యాల జిల్లాలో సుద్దాల వాగు పొంగిపొర్లుతోంది.
నిండు కుండలా మారిన నాగార్జున సాగర్
గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ జలశాయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,74,533 క్యూసెక్కులుగా ఉంటే ఔట్‌ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30గా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా నీటినిల్వ 309.95 టీఎంసీలకు చేరింది.
భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద స్థిరంగా ఉంది. దీంతో బుధవారం రాత్రి ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,10,286 క్యూసెక్కులు ఉండగా శ్రీశైలం నుంచి ఔట్‌ఫ్లో 2,09,533 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 35 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 16,027 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 551 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్య 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 13.71 టీఎంసీలకు చేరింది. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.300 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 3242 క్యూసెక్కులుగా ఉంది. కడెం జలాశయం 2 గేట్ల ద్వారా దిగువకు 12,135 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,638 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 633 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 22.145 టీఎంసీలకు చేరింది.
శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల దారి మళ్లింపు
ప్రతికూల వాతావరణంతో శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలను దారి మళ్లించారు. మొత్తం 9 విమానాలను అధికారులు దారి మళ్లించారు. విజయవాడ, బెంగళూరు, తిరుపతికి దారి మళ్లించిన అధికారులు, హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సిన 3 విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు.
జిల్లాల వారీగా వర్షపాతం నమోదు ఇలా
మంచిర్యాల 23.3 సెం.మీ, కుమురంభీం 23.3 సెం.మీ, ఆదిలాబాద్ 23.3 సెం.మీ, కన్నెపల్లి(మంచిర్యాల) 23.3 సెం.మీ, భీమిని (మంచిర్యాల) 22.6 సెం.మీ, రెబ్బెన(కుమురంభీ) 22 సెం.మీ, తాండూరు (మంచిర్యాల) 18.2 సెం.మీ, చిట్యాల(భూపాలపల్లి) 18 సెం.మీ, మంగపేట(ములుగు)16.4 సెం.మీ, నెన్నెల(మంచిర్యాల) 14.6 సెం.మీ, గిన్నెదారి(కుమురంభీం) 14.6 సెం.మీ , జంబుగ(కుమురంభీం) 13.8 సెం.మీ , జంకాపుర్(మంచిర్యాల)13.7 సెం.మీ , రేగొండ(భూపాలపల్లి) 13.3 సెం.మీ, కుంచవల్లి(కుమురంభీం) 12.7 సెం.మీ, బెల్లంపల్లి(మంచిర్యాల) 12.6 సెం.మీ, పెద్దకోడూరు(సిద్దిపేట) 12 సెం.మీ వర్షపాతం నమోదైంది
అప్రమత్తమైన ఏపి ప్రభుత్వం
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏపి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కలెక్టర్లు ప్రభుత్వ శాఖ అధికారులతో హోం మంత్రి వంగలపూడి అనిత విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
పెళ్లి కొడుకును భుజాలపై ఎత్తుకొని కల్వర్టు దాటించిన బంధువులు
మన తెలంగాణ/గన్నేరువరం: కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండల కేంద్రంలోని గన్నేరువరం ఊర చెరువు మత్తడి పోసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా చెరువు నిండుకుండలా మారి అలుగు పారుతోంది. దీంతో ఇరుపక్కల రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలో బుధవారం ఓ పెళ్లి చేరుకోవాల్సిన పెళ్లికొడుకు వాహనం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో చెరువు కట్టపై నిలిచిపోయింది. నాలుగు గంటల పాటు చెరువు కట్టపై వేచిచూసినా వరద ఉద్ధృతి తగ్గలేదు. ఇక ముహూర్త సమయం దగ్గర పడుతుండడంతో బంధువులందరూ విధి లేని పరిస్థితిలో పెళ్లికొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకెళ్లారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కల్వర్టు వల్ల ఇబ్బందులు పడుతున్నామని వెంటనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.