Monday, August 18, 2025

తెలుగు గజల్

- Advertisement -
- Advertisement -

ఊహలన్నవి నింగిపక్షులు
నేలకంతగ దిగవు త్వరగా
వాస్తవాలది అధోలోకం
నేలనే అవి కనవు త్వరగా

ముళ్లుపూవులు ఎదురుచూసే
నడక తప్పని దారినే ఇది
పూల స్మృతులవి మాసిపోవును
ముళ్ల తీపులు విడవు త్వరగా

స్వప్న పథమున సాగు కళ్లకు
గమ్యమన్నది ఎండమావియె
అయినా ఆశల కాళ్లు మాత్రం
వెనుక కెపుడూ చనవు త్వరగా

గోడపై జంత్రీలె మారును
మారినా తిథి తిరిగి వచ్చును
వయసు నీడలే ఏళ్లు అయినా
వెనుక తోడుగ చొరవు త్వరగా

చాటుమాటుగ చెప్పుకొందురు
స్నేహితులమని చెప్పజూతురు
వశము తప్పెను బుద్ధి మనసూ
ఎవరి మాటలు వినవు త్వరగా

నన్ను నేనే చెక్కుకుంటూ
మూర్తినై మురిపించలేనిక
కోలుపోయిన ముక్కలెన్నో
ఎవరికీ అగుపడవు త్వరగా

తాను తెలుసనువారే అందరు
ఒకరు సరిగా జాడ తెలుపరు
ఎటులో దారిని పడితి ఎందుకో
చేర అడుగులు పడవు త్వరగా
హృదయ మందున కనుల ముందున
తానే అంతట తానే నేనుగ
కానీ నన్నే తాను చూసే
చూపులవి కనుగొనవు త్వరగా

రాకుమారా! నీకునీవే
మిత్రుడైనా శత్రువైనా
అద్దమద్దము ఎదురుపడితే
పెరుగు స్పర్థలే తెగవు త్వరగా

  • మడిపల్లి రాజ్‌కుమార్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News