“నాకు కొంచెం నమ్మకమివ్వు
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టమాటో లాంటి సూర్యుణ్ణి
ఆరిన అప్పడం లాంటి చంద్రుడ్ని
ఆకాశపు ఎంగిలి పళ్లెంలోంచి నెట్టేస్తాను
నాదగు బహు బంధనంలో
ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను”
ఇలా అడుగుతున్నది తెలుగులో అతి నవ్య కవిగా పేరుగాంచిన ఆలూరి బైరాగి. బతికిన కాలమం తా కవిత్వమే శ్వాసగా జీవించిన వాడు. కవిత్వంలో ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఒక సముద్రపు పొంగులా అనేకానేక భాషాపద చిత్రాలతో, కొత్త పుంతలు తొక్కినవాడు. 1925 సెప్టెంబర్ 5న జన్మించిన ఆలూరి బైరాగికి ఇది శతజయంతి సంవత్సరం. బీహార్ చదువుకోడానికి వెళ్లి 1941 లో తిరిగి వచ్చిన కొద్ది కాలానికే ఆయన తల్లి చనిపోవడం, ఆలూరి బైరాగికి అశనిపాశమైంది. అతన్ని ఆమె మరణం అన్ని విధాలా కృంగదీసిం ది. తల్లి పట్ల అతనికున్న ప్రేమను ప్రకటించుకోవడానికి చీకటి నీడలు కవితా సంపుటిని అమ్మకు అంకితమిస్తూ ‘అమ్మ ఈ కవిత్వాల ప్రతి చరణంలో, బ్రతికి ఉన్న ప్రతి శబ్దంలో పలుకరిస్తు న్న, నీకు, ఇవ్వడానికి, నా దగ్గర ఇంతకంటే ఏ ముంది’ అంటాడు బైరాగి. పాఠశాలకు వెళ్లి చదువుకున్నది రెండవ తరగతి అయినప్పటికీ హిందీ, ఆంగ్లభాషల పట్ల అద్భుతమైన అభినివేశాన్ని కలిగి ఉండడం ఆశ్చర్యచెకితుల్ని చేస్తుంది.
Also Read: కారు దిగలేదు.. చెయ్యందుకోలేదు
బైరాగి కవిత్వంలో చూపిన స్వతంత్రత స్వేచ్ఛాతత్వంపై ఏ ఇజానికీ లొంగని నవ్య మానవతా దృక్పథం అనుకోవచ్చు. బైరాగి పెద్దగా ఎవరితో కలిసేవాడు కాదు. ఏకాంత చింతన, తనలో తానే ఉండిపోవడం ఎక్కువగా ఉండేది. తాను రాసిన కవితలు అన్నింటిని ‘చీకటి నీడలు’ పేరుతో కవి తా సంపుటిగా తీసుకువచ్చాడు. చీకటి నీడలు, కవితాసంపుటి సాహితీలోకంలో గొప్ప సంచల నాన్ని తీసుకువచ్చింది. ఊహకీ, వాస్తవానికీ, క్రియకి, కదలికకి మధ్య ఎవరిలో నీడలు పడుతున్నాయంటూ మొదలైన ఆ కవితా సంపుటి ఆధునిక నవ్య కవితా వాదాన్ని ముందుకు తెచ్చింది. అభ్యుదయ, భావ కవితా ధోరణులకంటే భిన్నమైన ధోరణికి మార్గదర్శకుడయ్యాడు బైరాగి.
పరిసర వాతావరణం నుండి రవ్వంత తొలగి నిలిచి, లోకాన్ని ఆత్మీయతతో జాలితో, ఆవేశం తో ఆవేదనతో చూడగలిగిన కవిత్వ కవితాత్మక శక్తి బైరాగిది. సాటి మనిషి కష్టాలను సొంతం చేసుకొని వాటికి విశ్వజనీయతను కల్పించడం బైరాగి కవితా నిర్మాణం. బైరాగి కవిత్వంలో వాడే పదజాలం అద్భుతంగా ఉంటుంది. భాష మీద ఆయనకు ఉన్న పట్టు చూస్తే చాలా ఆశ్చ ర్యం కలుగుతుంది. ఆయన వాడిన పదజాలం, ఏ ప్రత్యేక వాదానికి, ఇజానికి చిక్కవు. ఇదంతా ఆయన ప్రత్యేక సృష్టి. ప్రత్యక్ష పదం ఒక విధంగా ఉంటే వాటికి నిగూఢ అర్థాలను ఆపాదించడం బైరాగి ప్రత్యేకత. ‘అర్ధమైన దానికన్నా అధికంగా స్పురించేది, చేతలకు చెందరానిది, మాటలకు అందరాని కవిత్వం’ అన్న వాక్యాలు ఆయన తన కవిత్వానికి ఇచ్చుకున్న నిర్వచనం గా మనం భావించాలి. అనారోగ్యంతో మృత్యు వు వాకిట నిలిచినప్పుడు ‘నాకు చావు లేదు’ అంటూ మరణానికి తాను భయపడడం లేదని సమాజంలోని ద్వేషాన్ని, క్రౌర్యాన్ని నిలదీస్తాడు. ఒక తాత్విక ధోరణితో సాగిన ఈ కవితలో ‘చూపులోన మృత్యువుంది, పిడికెడు బూదిలోన మృత్యువుంది, మృత్యువు లేని చోటు చెప్పు మనకచట ఉనికి ఏర్పరుస్తాను’ అంటాడు. బైరాగి ‘నూతిలో గొంతుకలు’ ఒక విలక్షణమైన సంశయాత్మక కావ్యం. దీనిలో మానవుడు ఏది త్రోవ? అని అడుగుతాడు. వేదనే జీవితమైన చోట జీవితంలో ఏదీ కర్మ, ఏది కర్మ క్షేత్రంలో తక్షణికం, ఏది కర్మ తరువాత బాధ అనే అంశాలను షేక్‌స్పియర్ హామ్లెట్, మహాభారతంలోని అర్జునుడు, ఇలియట్ రాస్కెల్ని కోవ్ పాత్రల ద్వారా వ్యక్తపరుస్తాడు..
‘ఏది బ్రతుకు, ఏది చావు, పొంగే వరదల మధ్య ఈదే వారు, ఈదని వారు, మునిగే వారు, తేలేవారు, కర్మణ్య, కర్మణ్యతల, సాఫల్యాసాఫల్యా ల, చలదూర్ముల ప్రహారాలు తప్పుకొని చేరుతాడు ఒక ఒకే ఒక్క తీరాన్ని, కాని వాళ్ళు అయి న వాళ్ళు నిలుస్తారు, ఒకే ఒక్క ద్వారాన్ని, ఒక్క చావు, ఒక్క బ్రతుకు లెక్క ఏమిటి’ అంటూ హామ్లె ట్ ద్వారా పలికిస్తాడు. ఇది కర్మ పూర్వపు వేదన. ఈ వేదన మానవుని సహజ వేదన. మనిషి తనలోకి తాను చూసుకున్నప్పుడు కలిగే వేదన. రెండవ ప్రపంచ యుద్ధం బైరాగి మీద తీవ్రంగా ప్రభావం చూపించింది అనడానికి ఉదాహరణ గా అర్జున విషాద యోగం కనబడుతుంది. భారతంలో కురుక్షేత్ర రణరంగంలో అస్త్ర సన్యాసం చేయబోయిన అర్జునుని పాత్ర అప్పటికప్పుడు అతనిలోని యుద్ధ వ్యతిరేక భావనలు ప్రతీకలు గా తీసుకొని బైరాగి, ‘పోదాం పద, ఓ దేవా! రా జ్యము వద్దు, రాజ్యం వద్దు ఈ విద్వేషాజ్ఞలకిక ఆజ్యమొద్దు, అతి విస్తృత వసుధ మీద దుర్లభమా ఆశ్రయమే’ అని తన యుద్ధ వ్యతిరేకతను ప్రకటిస్తాడు. రాస్కల్ని కోవ్ ద్వారా త్రోవ ఎక్కడ, వెలుగులెక్కడ, శరణం ఎక్కడ, త్రోవ తప్పిన ప్రేతకోటిక త్రోవ ఎక్కడ, అని వెతుకులాట మొదలు పెడతాడు.
బైరాగ కవిత్వం పార్శ్వాలను తడిమి చూడడం, ఆయనలోని సామాజిక, రాజకీయ, తాత్విక కోణాలను పరిశీలించడం, మరి ముఖ్యంగా ఆ యన ఉపయోగించిన పదబంధాలు, భాషా సౌరభాలు ఆస్వాదించడం, తాదాత్మ్యం చెందడం దాదాపు నాకు ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పుడు ఆయన కవిత్వం తీసి చదివినా, కొత్త దృశ్యాలు మనోఫలకం మీద ఆవిష్కృతం అవుతాయి. కవిత్వంతో నూరేళ్లకు జీవించి ఉన్న బైరాగి మరో నూరు నూరులైన బతికే ఉంటాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
బండ్ల మాధవరావు