వామనావతారంలో వామనుడు బలిచక్రవర్తి నుంచి తన పాదంతో మూడడుగుల నేల మాత్రం కావాలి అని కోరితే, బలిచక్రవర్తి, ఆ వామనుణ్ణి, నువ్వే మూడడుగులున్నావు, ఇంక నీ పాదం ఎంత, నీకు అడగడం కూడా రాదు, నేను చెపుతా వాటిలో నీకిష్టమైనదేదైనా కోరుకో అని ఒక పెద్ద జాబితా చదువుతాడు, అయినా నాకు మూడడుగులే కావాలి అని చిన్న పిల్లాడిలా పట్టుబట్టడంతో సరే అని తప్పనిసరై మూడడుగులు దానం ఇచ్చాడు.
శా. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరు అనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు (higher peaks) చేరుకున్న వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం లోకంలో పరిపాటి అయిపోయింది. ప్రతి పదానికీ విరుగుతూ, వామనుడు ప్రతి పద పదానికీ పెరుగుతూ పోయే క్రమతను చూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశారు. ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయి, మేఘ మండలాన్ని దాటి, సూర్యుడ్ని, చంద్రుడ్ని, దాటి ధృవ మండలాన్ని కూడా దాటి, పైనున్న ఏడు లోకాలలో చివరిదైన సత్య లోకాన్ని కూడా, ఒక పాదంతో కొలిచేయడం పోతన గారు బహుశా స్వయంగా చూసి ఉంటారు. సామాన్య మానవులైన మనందరినీ దృష్టిలో ఉంచుకుని ఆయనే మన కోసం ఒక కొలబద్దని సృష్టించుకుని, సూర్యుడ్నే ఒక కొలబద్దగా తీసుకుని మరో పద్యం ఆయన తనకొచ్చిన ఊహతో, ఆ వామనుడి ఎదుగుదల మనకి అర్ధం అయ్యేలా వ్రాశారు. అది ఎలా ఉందో చూడండి
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్
వామనుడు పెరిగే కొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, మెడలోని హారంలో మణిగానూ, బంగారు భుజకీర్తి లాగై, కరకం కణంలా గానూ, నడుముకు కట్టిన మొలత్రాటిలో బంగారు గంటగా నూ, పాదాల అందెగానూ, ఆఖరుకు పా దపీఠం గానూ కనిపించిందట. ఈవిధంగా ఆకాశంలో భగభగమండుతు న్న సూర్య భగవానుడైతే ప్రతినిత్యం మనం చూడగలుగుతాం కనుక ఆయన్నే ఒక కొలబద్దగా చేసి పైపై లోకాలన్నీ దాటిపోతున్న వామనమూర్తికి ఆయన శరీరంలో ఆ సూర్య భగవాను డు ఎక్కడెక్కడ, ఆయనకి ఎలాంటి అలంకారంలా ప్రకాశిస్తున్నారో చూపెట్టి, చివరికి ఆ సూర్య భగవానుడు ఆయన పాదం క్రింద బంగారు పీటగా మారి పోయారని చూపెట్టి, ఆ రకంగా పైనున్న లోకాలన్నీ ఒక పాదం తో కొలిచి, ఇక్కడ భూమినంతా, ఒక పాదంతో కొలిచి, ఇంకా ఒక అడుగు నాకు ఇవ్వవలసి ఉందికదా! నీదైన భూమండలమంతా ఒక పాదానికి సరిపోయింది, నువ్వు దండెత్తి సంపాదించుకున్న, దేవలోకంతో సహా పైనున్న లోకాలన్నీ ఒక పాదానికి సరిపోయింది.
మరి మూడో పాదానికి దారి లేదు కదా! ఈ మూడో పాదం ఎక్కడ పెట్టాలి అని అడిగితే, ఆ చక్రవర్తి పాపం ఇచ్చిన మాట తప్పని వాడు కనుక, పైగా ఆ దానం స్వీకరిస్తున్నది, సాక్షాత్తు విష్ణుమూర్తి అని ముందే తన గురువులైన శుక్రాచార్యులు చెప్పినా వినకుండా, ఇచ్చాడు కనుక, ఆ పాదాన్ని తన తలపై పెట్టమని అన్నాడు. అంతే మూడో అడుగు కోసం తన పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సుపై ఉంచి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి, ఆ బలి చక్రవర్తిని పాతాళానికి రాజుని చేశాడు. తెలుగుల పుణ్య పేటి భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం.
- విశ్వనాథ సుబ్బారావు