Thursday, August 28, 2025

స్కాలర్‌షిప్స్, ఫీజు బకాయిలు చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ. 6 వేల కోట్లు వెంటనే చెల్లించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొత్తగా 100 బిసి కాలేజీ హాస్టలు, 119 బిసి గురుకులాలు మంజూరు చేయాలని, బిసి గురుకులాల్లో 20 శాతం సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ బిసి విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు మాసాబ్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ స్కాలర్ షిప్స్, ఫీజు బకాయిల పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. స్కాలర్‌షిప్స్, ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా గ్రామాల్లో వ్యవసాయ కూలీల పిల్లలు, మెడిసన్, ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీలు చదువుతున్నారని, సమాజంలో గుణాత్మకమైన మార్పు ప్రారంభమైందని అన్నారు.

బాల కార్మికులను అరికట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరు ఉన్నత విద్య చదువుకుంటున్నారని, ఈ గుణాత్మకమైన మార్పును ఆహ్వానించేది పోయి చదువు కోకుండా అడ్డుకుంటున్నారని కృష్ణయ్య ఆరోపించారు. ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారని, ఫీజులు కట్టాలని విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని, కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఫీజులు చెల్లించక పోవడంతో కాలేజీ యాజమాన్యాలు అద్దె భవనాల అద్దె కట్టడం లేదని, లెక్చరర్ల జీతాలు నెలల తరబడి ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక పథకాలకు లక్షల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకానికి రూ. 6 వేల కోట్లు అప్పు తెస్తే ఎవరు అడ్డుకుంటారని కృష్ణయ్య ప్రశ్నించారు. ఒకవైపు ఫీజు బకాయిలు చెల్లించకుండా ఇంకొక వైపు ఫీజుల స్కీములు ఎత్తివేయడానికి ‘ట్రస్ట్ బ్యాంకు‘ ఏర్పాటు చేసి దాని ద్వారా ఫీజులు చెల్లిస్తామని కొత్త నాటకానికి తెర లేపారని,

ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కృష్ణయ్య స్పష్టం చేశారు. కాలేజీ హాస్టల్లో గురుకుల పాటశాలలో సీట్లు రాక చాల మంది విద్యార్థులు చదువు మనుకుంటున్నారని, అదనంగా హాస్టల్స్ మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి గురుకుల పాఠశాలల్లో సీట్లు లభించక తెలుగు సంక్షేమ భవన్ చుట్టూ రోజుల తరబడి ప్రజలు తిరుగుతున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. వసతి సౌకర్యం ఉన్నచోట అదనపు సెక్షన్లు ప్రారంభించాలని అలాగే ప్రతి క్లాసులో 20 శాతం సీట్లు అదనంగా పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ, గుజ్జ కృష్ణ, ససుధాకర్, నంద గోపాల్, యస్.రవి కుమార్ యాదవ్, చంద్ర శేఖర్, నిఖిల్, అరవింద్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News