సంపూర్ణ చంద్రగ్రహణంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక సేవలను రద్దు చేశారు. సోమవారం ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవకులను ఏకాంతంగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కవాట బంధనం చేశారు. నిత్య కైంకర్యాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేశారు. భక్తులకు స్వామి వారి దర్శనాలు నిలిపివేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాలు తలుపురు తెరుస్తారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయి. రాహుగ్రహస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మూసివేశారు.
స్వామి వారికి అన్న ప్రసాదం నివేదిన చేసిన అర్చకులు అనంతరం గుడి తలుపులు మూసివేశారు. అలాగే కొమురవెల్ల మల్లికార్జున స్వామి ఆలయం , కాళేశ్వరం ఆలయం మూసివేశారు. దక్షిణ కాశీగా పేరొగాంచిన వేములవాడ రాజన్న ఆలయం మూసివేశారు. తెల్లవారుజామున 3.45 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఉదయం 6.30 గంటలకు భక్తుల దర్శనం ప్రారంభిస్తారు. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారమం భీమేశ్వర ఆలయం కూడా మూతపడింది. అలాగే టిటిడి పరిధిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయ గుంట శ్రీ పసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాలు, కపిలతీర్థం ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. అలాగే శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మధ్యాహ్నం 1గంటకు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున 5గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.