Friday, July 11, 2025

టెన్నిస్ క్రీడాకారిణి రీల్స్ చేస్తుందని.. కన్నతండ్రి దారుణం

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె కన్నతండ్రే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన గురుగ్రామ్‌లో జరిగింది. టెన్నిస్ క్రీడాకారిణి అయిన 25 ఏళ్ల రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి కాల్చి చంపిన ఆరోపణలతో గురువారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సెక్టార్-57లోని సుశాంత్ లోక్ ఫేజ్ 2 జి బ్లాక్‌లోని వారి నివాసంలో కాల్పులు జరిగాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాధిక తన ఇంటి లోపల రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని.. కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని దీపక్ యాదవ్ గా గుర్తించారు. అతను తన కుమార్తెపై అతి దగ్గర నుండి ఐదు రౌండ్లు కాల్చాడని పోలీసులు తెలిపారు. ఇందులో మూడు బుల్లెట్లు రాధికను తాకడంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని చెప్పారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడానికి అలవాటు పడటంతో తన కూతురు రాధికను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, రాధిక యాదవ్ హర్యానా టెన్నిస్ సర్క్యూట్‌లో రాష్ట్రస్థాయి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పలు పోటీల్లో పాల్గొని మంచి విజయాలు సాధించింది.ప్లేయర్ గానే కాకుండా.. టెన్నిస్ అకాడమీని కూడా నడుపుతోంది. అక్కడ పలువురు ఔత్సాహిక ఆటగాళ్లకు ఆమె శిక్షణ కూడా ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News