ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం సందర్భంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హెచ్ సిఎ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించింది. కొత్తగా 300 క్లబ్‌లకు అవకాశం ఇవ్వాలని టిసిజెఎసి డిమాండ్ చేస్తోంది. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు టిసిజెఎసి మెంబర్స్ యత్నించగా పోలీసుల వారిని అడ్డుకుని స్టేషన్ కు తరలించారు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద రాచకొండ సుధీర్ బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. హెచ్ సిఎ సమావేశంలో 173 క్రికెట్ క్లబ్‌లకు సంబంధించిన సెక్రటరీలు, తొమ్మిది మంది మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని హెచ్‌సిఎ తేల్చి చెప్పింది. అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లోపలికి పోలీసులు అనుమతి ఇస్తున్నారు. హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు సందర్భంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ ఆఫీసర్ ఏర్పాటుపై చర్చించనున్నారు.