Saturday, May 10, 2025

టెరిటోరియల్ ఆర్మీని పిలిపించండి…

- Advertisement -
- Advertisement -

ఆర్మీచీఫ్‌కు కేంద్రం అధికారాలు

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసిన పాక్‌ను భారత్ సమర్థంగా అడ్డుకొంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్ మరో కుతంత్రానికి తెరదీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్‌ను ఇబ్బంది పెట్టాలనేది పాక్ పన్నాగం. దీంతో ఆ దేశానికి అలాంటి అవకాశం ఇవ్వకుండా భారత ఆర్మీని మరింత దృఢంగా తయారు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగం లోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది.

ధోనీ, మోహన్‌లాల్ … వీరంతా లెఫ్టినెంట్ కర్నల్ అధికారులు

ఇప్పటివరకు పలు సందర్భాల్లో టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది యుద్ధాల్లో పాల్గొంది. 1962,1965,1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి పనిచేశారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగానూ సేవలు అందించారు. ఇటీవల కేరళ వరదల్లో స్టార్ నటుడు మోహన్ లాల్ తనవంతు సేవలు అందించిన సంగతి తెలిసిందే. అతడు కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి అధికారి. ఈ జాబితాలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సచిన్‌ పైలట్, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా, లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నారు. కనీస అర్హత సర్వీస్ పూర్తి చేసిన వారికి పింఛనుతోపాటు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్, మెడికల్, ఎల్‌టీ అలవెన్సులు ) అందిస్తారు.

టెరిటోరియల్ ఆర్మీ అంటే…

టెరిటోరియల్ లేదా ప్రాదేశిక ఆర్మీ గురించి క్లుప్తంగా చెప్పాలంటే సైనిక రిజర్వ్‌ఫోర్స్. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహా లోనే శిక్షణ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తుంటారు. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించారు. ఆ తర్వాత 1949లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్టు సమాచారం. వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినప్పటికీ… నిరంతరం సైన్యం తోనే ఉండరు. అవసరమైన సందర్భాల్లో కదన, ప్రకృతి వైపరీత్యాల్లో రంగం లోకి దిగుతారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారుల్లో పలువురు శౌర్య, విశిష్ట పురస్కారాలను అందుకొన్నారు.

 

Territorial Army services

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News