పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులతోపాటు అతడి సన్నిహితులు మొత్తం 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ దాడుల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది మృతులు ఒక్కొక్కరికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
దీంతో జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు ఎక్స్‌గ్రేషియాగా ప్రభుత్వం తరఫున అందనుంది. మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మందికిపైగా మరణించినట్లు భారత్ వెల్లడించింది. అయితే ఈ దాడిలో మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవుఫ్ అజార్‌తో పాటు అతని ఇద్దరు బావలు మరణించారు. అయితే ఈ అబ్దుల్ రవుఫ్ అజార్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా భారత్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హైజాక్ పథక రచనలో ఇతడు కీలక సూత్రదారి.