మరో 20మంది పరిస్థితి విషమం జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్ బైసరన్ లోయలో
పాశవిక చర్య మృతుల్లో ఇద్దరు విదేశీ టూరిస్టులు గుర్తింపుకార్డులు చూసి మరీ
గురిపెట్టి కాల్చిన ఉగ్రవాదులు ఇది తమ పనేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ
ప్రకటన ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి దిగ్భ్రాంతి హోంమంత్రి
అమిత్‌షాకు ప్రధాని ఫోన్, జమ్మూకశ్మీర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశం
హుటాహుటిన జెడ్డా నుంచి మోడీ తిరుగుపయనం ఉగ్రచర్యను ఖండించిన
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్ ఘటనపై సిఎం రేవంత్, విపక్షనేత కెసిఆర్
దిగ్భ్రాంతి భారత్‌కు అండగా నిలుస్తాం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
దశ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక కేంద్రం పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు మంగళవారం విరుచుకుపడి 27 మందిని హతమార్చిన ట్లు, , కనీసం 20 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మొదట్లో మృతుల సంఖ్య ముగ్గురిగానే భావించినప్పటికీ ఆ తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగింది. మృతుల సంఖ్యను ఇంకా నిర్ధారించుకుంటున్నట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.‘ఇటీవలి సంవత్సరాల్లో మనం చూసిన దాని కన్నా దాడి మరింత పెద్దదే’ అని ఆయన ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. మంగళవారం మధ్యా హ్నం సుమారు 3 గంటటకు ఉగ్రవాదులు బైసరన్ లోయలో కొండ ది గివచ్చి టూరిస్టులపై కాల్పులు ప్రారంభించారు. సుదీర్ఘ హరిత మైదా నం కారణంగా ‘మినీ స్విట్జర్లాండ్’గా తరచూ అభివర్ణిస్తుండే ఆ ప్రదేశాన్ని టూరిస్టులు పెద్ద సంఖ్యలో
సందర్శిస్తుంటారు.మృతులో ్లఇద్దరు, ముగ్గురు విదేశీపర్యాటకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.కర్నాటకలోని శివమొగ్గకుచెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా మృతుల్లో ఉన్నారు. తన కళ్ల ముందే తన భర్తను కాల్చి చంపినట్లు ఆయన భార్య విలపిస్తూ తెలిపింది. కాగా ఉగ్రవాదులు పర్యాటకులను పట్టుకుని ఎవరు ముస్లింలో, ఎవరు కాదో తెలుసుకుని మరీ ఎంపిక చేసి హతమార్చినట్లు చెబుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన కుటుంబంతో భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఉగ్ర దాడి చోటు చేసుకుంది. వాన్స్ మంగళవారం రాజస్థాన్‌లో ఉన్నారు. దాడి ప్రదేశానికి సంబంధించినదిగా భావిస్తున్న ఒక వీడియోలో పలువురు రక్తమోడుతూ, అచేతనంగా నేలపై పడి ఉండడం కనిపించింది. మహిళా టూరిస్టులు విలపిస్తూ, తమ సన్నిహితుల కోసం వెతుకుతుండడం కనిపించింది. ‘నేను చాలా షాక్ తిన్నాను. మన సందర్శకులపై ఈ దాడి ఘోరాతిఘోరం. ఈ దాడికి పాల్పడినవారు పశువులు, మానవత్వం లేనివారు, ఖండనార్హులు.
గర్హించేందుకు మాటలు చాలవు. మృతుల కుటుంబాలకు నా సానుభూతి’ అని సిఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఏళ్ల తరబడి తీవ్రవాదం కింద కొట్టుమిట్టాడిన తరువాత కాశ్మీర్ పర్యాటకుల రాకతో కళకళలాడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. 38 రోజుల అమర్‌నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభం కానున్నది. క్షతగాత్రుల తరలింపునకు హెలికాప్టర్‌ను అధికారులు నియోగించారు. క్షతగాత్రులు కొందరిని స్థానికులు తమ గుర్రాలపై మైదానంలో నుంచి తీసుకువచ్చారని అధికారులు తెలియజేశారు. గాయపడిన 12 మంది టూరిస్టులను ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు, వారందరి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు పహల్‌గామ్ ఆసుపత్రిలో ఒక వైద్యుడు చెప్పారు. ‘నా భర్తను తలపై కాల్చారు, మరి ఏడుగురు కూడా ఈ దాడిలో గాయపడ్డారు’ అని ఒక మహిళ ఫోన్‌లో ‘పిటిఐ’తో చెప్పారు. ప్రాథమిక వార్తల ప్రకారం, ఉగ్రవాదులు బైసరన్ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవిలో నుంచి వచ్చారు.
ఆ ప్రదేశం 1980 దశకంలో బాలీవుడ్ చిత్ర నిర్మాతలు, దర్శకులకు ప్రీతిపాత్రమైనది. ఉగ్రవాదుల దాడి వార్త నగరానికి చేరగా ఆర్మీ, సిఆర్‌పిఎఫ్, స్థానిక పోలీసులు హుటాహుటిని బైసరన్ మైదానానికి తరలివెళ్లారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఉగ్ర ముష్కరుల కోసం పెద్ద ఎత్తున గాలింపు ప్రారంభించినట్లు, భద్రతా దళాలు అన్ని వైపుల నుంచి గాలిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు పర్యాటకులతో కళకళలాడుతున్న పహల్‌గామ్ రిసార్ట్ ఉగ్ర దాడి అనంతరం నిర్మానుష్యంగా మారిపోయిందని, పర్యాటకులు ప్రాణ భయంతో ఆ ప్రదేశాన్ని వీడారని అధికారులు చెప్పారు. మరో వైపు ఈ ఘటనకు తమదే బాధ్యత అని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రిసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది.
జెకెకు వెళ్లాలని అమిత్ షాకు ప్రధాని మోడీ ఆదేశం
జమ్మూ కాశ్మీర్‌లో టూరిస్టులపై ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రస్తుతం సౌదీరేబియాలో ఉన్న ప్రధాని మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడి, పరిస్థితిని సరిదిద్దేందుకు తగిన చర్యలు అన్నీ తీసుకోవలసిందిగా కోరారు. జెకెను సందర్శించాలని అమిత్ షాను మోడీ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీనగర్ చేరుకుని ఉన్నతస్థాయి అధికారులతో పరిస్థితినిసమీక్షించారు. దేశ రాజధానిలో ఉన్న జెకె లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబి డైరెక్టర్ తపన్ డెకా, కొద్ది మంది సీనియర్ అధికారులు కూడా అమిత్ షా వెంట వెళ్లారు. ‘పహల్‌గామ్‌లో పర్యాటకులపై ఉగ్ర దాడికి ఆవేదన చెందాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. ఈ పైశాచిక కృత్య ంలో పాల్గొన్నవారిని క్షమించేంది లేదు. వారిపై విరుచుకుపడతాం’ అని అమిత్ షా తెలిపారు.
రాష్ట్రపతి సంతాపం
పహల్‌గామ్ ఉగ్రదాడి దిగ్భ్రాంతికరం. ఇదొక అమానవీయ చర్య.అమాయకులైన పౌరులను లక్షంగా చేసుకోవడం భయానకం.ఇది క్షమించరానిది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో పోస్టు చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుగా పలువురు కేంద్రమంత్రులు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య : కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలో పర్యాటకుల మరణం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు పిరికిపంద చర్య అని అభివర్ణించారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అమాయక పర్యాటకులు మరణించడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి హింసాత్మక సంఘటనలను భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.
సిఎం రేవంత్, కెసిఆర్, కెటిఆర్ దిగ్భ్రాంతి
ఉగ్రదాడి ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండి స్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన తెలిపారు. పెహల్ గావ్ ఘటనపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రవాదుల చర్యను ఖండిస్తూ మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ పాశవిక దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు కెటిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.