Tuesday, July 29, 2025

సంక్షేమంపై గొప్పలు.. అప్పుల కోసం తిప్పలు!

- Advertisement -
- Advertisement -

అప్పులు చేయడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతూ ప్రజలపై పెనుభారం మోపుతూ, దేశాన్ని దివాలా తీయిస్తున్నాయి. భారత కమ్యూనిస్టు విప్లవకారుల నాయకుడు తరిమెల నాగిరెడ్డి 1970లోనే ‘తాకట్టులో భారతదేశం’ అనే మహత్తర గ్రంథంలో చెప్పిన విషయాలు, విశ్లేషణలు ఎంత వాస్తవంగా ఉంది నేడు పాలక ప్రభుత్వాలు అమలు జరుపుతున్న ఆర్థిక, రాజకీయ విధానాలే నిదర్శనం. 1947 ఆగస్టు 15 న అధికార మార్పిడి జరిగినప్పుడు 1000 కోట్ల స్టెర్లింగ్ నిల్వలను బ్రిటిష్ పాలకుల అప్పగించారు. ఆ నిల్వలు కరిగిపోయి పాలక ప్రభుత్వాలు అప్పులు చేయడం ప్రారంభమై నేడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అప్పుల మొత్తం క్రమంగా పెరుగుతూ 2014 మార్చి 31నాటికీ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటికి దేశం అప్పు రూ. 58.6 లక్షల కోట్లు.

మోడీ నాయకత్వాన ఏర్పడిన ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వ పాలనలో 2023 మార్చి 31 నాటికి రూ. 155.6 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక (Finance of Central Govt)సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  ఈ అప్పు 2024 మార్చి నాటికి రూ. 1,63,35,070 కోట్లకు చేరి, 2025 మే 31 నాటికి దేశం అప్పులు రూ. 181 కోట్లకు పెరిగింది. ఇందులో విదేశీ అప్పు 2024లో 5,37,484 కోట్లు కాగా, 2025 మార్చి 31 నాటికి రూ. 5,74,927.51 కోట్లకు పెరిగాయి. దేశీయ అప్పులకు 2024లో రూ. 8,57,482.79 కోట్లు వడ్డీ చెల్లించగా, విదేశీ అప్పులకు రూ. 32,597.70 కోట్లు మోడీ ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వాలన్నీ 67 సంవత్సరాల్లో 58.6 లక్షల కోట్లు అప్పులు చేయగా, మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో రూ. 126 లక్షల కోట్ల అప్పు చేసింది.

అప్పులు చేయటంలో మోడీ ప్రభుత్వ ఘనతకు ఇది నిదర్శనం. ఈ అప్పుల ఫలితంగా దేశంలోని ప్రతి వ్యక్తి పైన రూ. 80 వేలకు పైగా అప్పుల భారం మోపింది. మోడీ ప్రభుత్వం భారీ మొత్తంలో చేసి అప్పులు ప్రజల వల్ల ఏ ఒక్క మౌలిక సమస్య పరిష్కారం కాలేదు. పారిశ్రామిక అభివృద్ధికి గాని, గ్రామీణ, పట్టణ పేదలకు ఉపాధి పెంచేందుకు గాని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గాని, పేదలకు విద్య, వైద్యం అందించటానికి గాని ఉపయోగించలేదు. రైతాంగానికి న్యాయమైన ధరలు కల్పించటానికి వినియోగించ లేదు. బడా పారిశ్రామికవేత్తలకు, విదేశీ కార్పొరేట్ సంస్థలకు రాయితీల రూపంలో అత్యధిక భాగం కట్టబెట్టటం జరిగింది. పారు బకాయిల పేరుతో బడా పెట్టుబడిదారుల లక్షల కోట్ల బ్యాంకుల అప్పులు రద్దు చేయటం జరిగింది. ఎంగిలి మెతుకులు వేసినట్లు కొన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను భిక్షగాళ్లుగా చూస్తున్నది.

మోడీ ప్రభుత్వాన్శి ఆదర్శంగా తీసుకుని అప్పులు చేయటంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వంతో పోటీ పడుతున్నాయి. లక్షల కోట్ల అప్పులతో రెండు రాష్ట్రాలు మనుగడ సాగిస్తున్నాయి. అప్పు చేయకుండా ప్రభుత్వాలు నడవని పరిస్థితి ఏర్పడింది.రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుల నుంచి రాష్ట్రానికి వచ్చిన అప్పు రూ. 75,577 కోట్లు. 2014 టిడిపి ప్రభుత్వ పాలనలో 2014- 15 నాటికి రూ. 1. 48 లక్షల కోట్లకు, 2015- 16 లో రూ. 1.69 లక్షల కోట్లకు, 2016- 17లో రూ. 1.94 లక్షల కోట్లకు, 2017- 18లో రూ. 2.23 లక్షల కోట్లకు, 2018 -19 నాటికి రూ. 2.57 లక్షల కోట్లకు అప్పులు పెరిగాయి.  ఈ అప్పు వైసీపీ ప్రభుత్వ పాలనలో 2019- 20 నాటికి రూ. 3.01 లక్షల కోట్లకు, 2020- 21 నాటికి రూ. 3.5 లక్షల కోట్లకు, 2021 -22 ఆర్థిక సంవత్సరానికి రూ. 3.78 లక్షల కోట్లకు, 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.49 లక్షల కోట్లకు పెరిగాయి.

ఈ అప్పులు 2024 -25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్‌లో చెప్పారు. 2014లో చంద్రబాబు నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడేనాటికి ఎపి అప్పు రూ. 5.62 లక్షల కోట్లు. 2024 జూన్ నుంచి 2025 జులై వరకు చంద్రబాబు చేసిన రూ. 1.75 లక్షల కోట్లు. నేడు రాష్ట్రం మొత్తం అప్పు రూ. 7,37,357 కోట్లు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు చేసిన అప్పుల గురించి పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని చంద్రబాబు అంటుంటే, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు చేసిన అప్పుల కన్నా వైసిపి ప్రభుత్వం తక్కువ అప్పులు చేసిందని జగన్మోహనరెడ్డి చెబుతున్నారు. ఇద్దరూ కలసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.

ఎపి అప్పుల నిమిత్తం ఏడాదికి చెల్లించాల్సిన అసలు, వడ్డీ రూ. 71,881 కోట్లు చెల్లించాలి. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం, వృద్ధిరేటు తగ్గి ఆదాయం పడిపోయి వడ్డీలు కట్టలేకపోతున్నామని, అందుకే రుణాలు రీ షెడ్యూల్ చేసి వడ్డీ రేటు గ్గించాలని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఆయన చెప్పిన సంపద సృష్టి, వృద్ధి రేటు పెరుగుదల ఏమైయింది. గత 13 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్ల అప్పు చేయడం ద్వారా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 1956 నుండి 2014 మార్చి వరకు అంటే 58 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పు రూ. 91,776.82 కోట్లు ఉంటే, గత 11 సంవత్సరాల్లో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు చేసిన అప్పులు రూ. 6,32,000 కోట్లుగా ఉంది. తెచ్చిన అప్పులు సాగు నీటి ప్రాజెక్టుల కోసం గాని, ఉపాధిని పెంచేందుకు గాని ఖర్చు చేయలేదు. సంక్షేమ పథకాలు ఒకటీ, అర తప్ప అమలు జరగటం లేదు.

చేసిన అప్పులు ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పటం లేదు. టిడిపి, వైసిపి కూటమి ప్రభుత్వాలు చేసిన అప్పుల వల్ల రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి తలపై లక్షకు పైగా అప్పుల భారం పడింది. తెలంగాణ రాష్ట్రం కూడా అప్పులు చేయటంలో ఎపితో పోటీ పడుతున్నది. కెసిఆర్ ప్రభుత్వంలో 2014-15లో రూ. 8,121 కోట్లు కాగా, 2015- 16లో ఆర్థిక సంవత్సరంలో రూ. 15,515 కోట్లు, 2016 -17లో రూ. 30,319 కోట్లు, 2017- 18లో రూ. 22,658 కోట్లు, 2018- 19లో రూ. 23,091 కోట్లు, 2019 -20లో రూ. 30,577 కోట్లు, 2020 -21లో రూ. 38,161 కోట్లు, 2021-22 లో రూ. 39,433 కోట్లు అప్పులు చేసింది. అప్పటికి మొత్తం అప్పు రూ. 2 లక్షల, 83 వేలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలం చేసిన అప్పు రూ. 1,58,041 కోట్లు. మార్చి 19, 2025 నాటికి రూ. 5,62,557 కోట్లుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు.

ఈ అప్పులకు ప్రతి రోజు రూ. 191 కోట్లు అప్పులకు వడ్డీలకు చెల్లించాలి. 2023 డిసెంబర్ నుండి 2024 జూన్ 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ. 25,118 కోట్లు అయితే అసలు వడ్డీలకు చెల్లించింది రూ. 38,049 కోట్లు. అసలు కన్నా రూ. 13 వేల కోట్లు వడ్డీల కింద చెల్లించారు. కెసిఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు చేసిన అప్పుల వల్ల రైతుల, గ్రామీణ, పట్టణ పేదల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదు. ఉపాధి అవకాశాలు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగలేదు. ఈ అప్పులు అన్నీ దేనికి ఖర్చు చేసింది ఏ ప్రభుత్వం చెప్పటం లేదు. ప్రభుత్వం చేసిన అప్పు ప్రతి వ్యక్తి పైనా సగటున లక్షకు పైగా ఉంది. రూ. 181 లక్షల కోట్లతో దేశాన్ని అప్పుల పాలు చేసిన మోడీ ప్రభుత్వం, దాన్ని మభ్యపెట్టి దేశం ఆర్థికంగా ముందుకు దూసుకుపోతున్నదని, ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, జిడిపి పెరుగుతూ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని ప్రచారం చేస్తున్నది.

అంబానీ, అదానీ, టాటా వంటి బడా పారిశ్రామికవేత్తల సంపదలు పెరగటం దేశ ఆర్థిక అభివృద్ధా, వారి సంపదలను లెక్కించి జిడిపి, ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని చెప్పటం మభ్యపెట్టటం కాదా! పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాన్ని లెక్కించినప్పుడే తలసరి ఆదాయం పెరిగిందా లేదా అన్నది తెలుస్తుంది. ఇది మాత్రం మోడీ ప్రభుత్వం చెప్పదు. వాస్తవంగా తలసరి ఆదాయం పెరిగితే 80 కోట్ల మందికి రేషన్ బియ్యాన్ని ఎందుకు ఇస్తుందో చెప్పాలి. చంద్రబాబు నాయకత్వాన ఉన్న ఎపి కూటమి ప్రభుత్వ సంపదలు సృష్టించి సంక్షేమ పథకాలు అమలు జరుపుతామని చెప్పి, సంపదలు సృష్టి మాట పక్కన పెట్టి, అప్పుల మాత్రం పెద్ద ఎత్తున సృష్టిస్తున్నది.

  • బొల్లిముంత
    సాంబశివరావు 98859 83526
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News