- కమిటీలో రెండు రాష్ట్రాల నిపుణులు, అధికారులు
- సోమవారంలోగా ఏర్పాటు.. నెలరోజుల్లో నివేదిక
- నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మించబోయే ప్రాజెక్టులను పరిశీలించనున్న కమిటీ
- అమరావతికి కృష్ణా రివర్‌బోర్డు అథారిటీ.. హైదరాబాద్‌లోనే గోదావరి బోర్డు
- నదీజలాల వినియోగంపై టెలీమెట్రి పరికరాల ఏర్పాటు
- శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు
- నాలుగు కీలకాంశాలపై సిఎంల సమావేశంలో అంగీకారం
- జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన గంటన్నరపాటు సాగిన సమావేశం
- ఇది తెలంగాణ విజయమని అభివర్ణించిన సిఎం రేవంత్‌రెడ్డి.. బనకచర్లపై చర్చ జరగలేదని సిఎం ప్రకటన
- కెసిఆర్ గతంలో ఏపికి తెలంగాణ జలహక్కులు ధారాదత్తం చేశారు
- ఆ అన్యాయాన్ని సవరించడానికే విధివిధానాలను తీసుకొచ్చామని వివరణ
- పట్టుబట్టి సాధించాం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై బుధవారం ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఫలప్రదంగా ముగిసింది. ఇరు రాష్ట్రాలు నదీ జలాల వివాదాలపై అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా నదీ జలాల వినియోగంపై టెలిమెట్రీల ఏర్పాటు, సమస్యల పరిష్కారం కోసం అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో గోదావరి బోర్డు, అమరావతిలో కృష్ణా బోర్డు, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు వంటి ఉన్నాయి.
నదీ జలాల వివాదాలపై ఇరు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్న నేపధ్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చొరవ తీసుకుని బుధవారం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబునాయుడు లతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తమ మధ్య బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అంశం చర్చకు రాలేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశం ఫలప్రదంగా జరిగిందని పదేళ్లుగా కెసిఆర్ నేతృత్వంలో బిఆర్‌ఎస్ పాలనలో పరిష్కారం కాని ప్రధానమైన నాలుగు అంశాలకు పరిష్కారం లభించే దిశగా నిర్ణయాలు జరిగాయని తెలిపారు. ఈ సమావేశం తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగా సిఎం పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమావేశంలో లేవనెత్తారు. వాటిలో ప్రధానమైన కొన్ని అంశాలపై ఎపి ప్రభుత్వం ఒప్పించేలా చర్చల్లో చతురత ప్రదర్శించారు. ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు సిఎం రేవంత్ రెడ్డి సూచనకు ఎపి సిఎం చంద్రబాబునాయుడు అంగీకారం తెలపడం విశేషం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి లోబడి, గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డును హైదరాబాద్‌లో, అలాగే కృష్ణా నదీ యాజమాన్యం బోర్డును అమరావతిలో ఏర్పాటుకు ఇరురాష్ట్రాలు అంగీకరించాయి. ఇరురాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు భద్రత దృష్టా వెంటనే మరమ్మతులు నిర్వహించేందుకు ఉభయ రాష్ట్రాలు అంగీకరించాయి. ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీని ఈనెల 21వ తేదీలోగా ఏర్పాటు చేసేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఈ కమిటీ తన నివేదికను నెల రోజుల్లో ఇస్తుందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కమిటీ ఏర్పాటుతో విభజన చట్టంలోని హామీలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని సిఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.
వాళ్ల దుఖాన్ని అర్ధం చేసుకుంటాం
ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటు తమకు బాగుంటుందని వాళ్లు అనుకుంటున్నారని, వారిని చూసి జాలిపడడం తప్ప ఏమి చేయలేమని సిఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా బిఆర్‌ఎస్ నేతలను విమర్శించారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా వారు ఏ సమస్యను పరిష్కరించలేకపోయారని, వాళ్ల దుఖాన్ని, బాధను తాము అర్ధం చేసుకుంటామని సిఎం దెప్పిపొడిచారు. వారికి సమాధానం తాము లేమని, తెలంగాణ ప్రజలకు తాము జవాబుదారీగా ఉన్నామని స్పష్టం చేశారు. పరిపాలన ఎలా చేయాలో తమకు తెలుసు అని, వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వుత పరిష్కారం చూపడం తమ బాధ్యత అని సిఎం పునరుర్ఘాటించారు. కెసిఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ధారదత్తం చేసి అన్యాయం చేశారని, వాటిని పరిష్కరించడానికి విధి విధానాలను ముందుకు తీసుకువచ్చామని సిఎం రేవంత్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
పునర్విభజన చట్టాన్ని పట్టిచుకోలేదు
పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని సిఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా సమస్యలు పరిష్కారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఎజెండాను మార్చిన సిఎం
గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఎజెండా అంశంగా ఉండడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కేంద్ర జల్ శక్తి కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు ఈ భేటిలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని సిఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. బుధవారం సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, కె.విజయానంద్‌లతో పాటు నీటి పారుదల శాఖ కార్యదర్శులు, పలువురు ఇంజినీర్లు హాజరయ్యారు.
గట్టిగా పట్టుపట్టి సాధించాం: మంత్రి ఉత్తమ్
జలశక్తి మంత్రి పాటిల్ వద్ద జరిగిన సమావేశంలో కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను గట్టి పట్టుపట్టి విజయం సాధించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నదీ జలాల వినియోగంలో టెలిమెట్రి విధానం అమలుకు కేంద్రం ఆమోదం, శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్‌కు ఆదేశాలు, హైదరాబాద్‌లో గోదావరి బోర్డు, ఆంధ్రలో కృష్ణా బోర్డు ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ఆయన వివరించారు. కృష్ణా-, గోదావరి నదులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు తీసుకువచ్చామన్నారు. వీటిపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, సాంకేతిక నిపుణుల కమిటీని వారం రోజుల్లో వేసి టైమ్ బౌండ్ ప్రోగ్రాంతో నెల రోజుల వ్యవధిలో ఇచ్చే నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
చర్చలు ఫలప్రదం: ఎపి మంత్రి నిమ్మల
కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని సమావేశం తదుపరి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్లే చోట్ల టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై చర్చించామని ఆయన వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారని చెప్పారు. కృష్ణా బోర్డు అమరావతిలో.. గోదావరి బోర్డు హైదరాబాద్‌లో ఉండేలా నిర్ణయం జరిగిందన్నారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనల్లో సాంకేతిక అంశాలు ఉన్నాయని, కృష్ణా, గోదావరి నదీజలాలపై సోమవారంలోపు అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.