రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పిజి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్ 2025)లో 93.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షకు మొత్తం 63,076 మంది దరఖాస్తు చేసుకోగా, 54,692 మంది హాజరయ్యారు. అందులో 51,317 (93.83 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో 18,573 మంది అబ్బాయిలు ఉంటే, 32,743 మంది అమ్మాయిలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ కుమార్ మొలుగరం, సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డితో కలిసి సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి సిపిగెట్ 2025 ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఎస్‌కె మహమూద్, ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్. ఇతర అధికారులు పాల్గొన్నారు.
10 నుంచి సిపిగెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సిపిగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి ప్రకటించారు. సిపిగెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 10 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించి, ఈ నెల 24వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 27వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 29 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
అత్యధికంగా దరఖాస్తు చేసుకున్న కోర్సులు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలు
కోర్సు దరఖాస్తులు ఉత్తీర్ణులైన విద్యార్థులు
ఎం.ఎ(ఇంగ్లీష్) 4097 3502
ఎం.ఎ(తెలుగు) 3935 3179
ఎం.ఎ(పొలిటికల్ సైన్స్) 3494 3092
ఎం.కాం 4754 4358
ఎంఎస్‌సి(కెమిస్ట్రీ) 4280 3291
ఎంఎస్‌సి(మ్యాథమెటిక్స్) 2492 2070
ఎంఎస్‌సి(జువాలజీ) 3828 3074