Friday, July 18, 2025

మాక్ కౌన్సెలింగ్‌పై పెదవివిరుపు

- Advertisement -
- Advertisement -

వెబ్ ఆప్షన్లు మార్చుకున్న 44553 మంది విద్యార్థులు
18న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్ల భర్తీ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈసారి జెఇఇ అడ్వాన్స్‌డ్ తరహాలో మాక్ కౌన్సెలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మాక్ కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపుతో సంతృప్తి చెందని 44553 మంది విద్యార్థులు మళ్లీ తమ వెబ్ ఆప్షన్లను మార్చుకున్నారు. మాక్ సీట్ల కేటాయింపు తర్వాత అవసరమైతే విద్యార్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. ఎప్‌సెట్‌లో విద్యార్థులు తాము పొందిన ర్యాంకుకు ఏ విధంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటే ఏ కాలేజీలో, ఏ బ్రాంచీలో సీటు వస్తుందో మాక్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవకాశం వచ్చింది. దాంతో మాక్ కౌన్సెలింగ్‌లో పొందిన సీటుతో సంతృప్తి చెందని 44553 మంది విద్యార్థులు మళ్లీ తమ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడంతోపాటు ఎక్కువ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఒకవేళ విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఆ ఆప్షన్లనే పరిగణలోకి తీసుకుని మొదటి విడత సీట్లు కేటాయిస్తారు.

ఈ నెల 18వ తేదీన తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగనుంది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం కన్వీనర్ కోటా కింద 172 కాలేజీల్లో మొత్తం 83054 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, మాక్ సీట్ల కేటాయింపులో 77154 సీట్ల కేటాయింపు జరిగింది. మాక్ కౌన్సెలింగ్‌లో 16905 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చినా వారికి ఏ కాలేజీలోనూ సీటు రాలేదు. ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో 95256 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, 94354 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం రికార్డు స్థాయిలో 5931279 వెబ్ ఆప్షన్లు నమోదయ్యాయి. ఈసారి గతంలో కంటే ఎక్కువగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అంటే విద్యార్థులు ఈసారి ఎక్కువ ఛాయిస్ ఇస్తూ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు అర్థమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News