Wednesday, July 16, 2025

గవర్నర్‌కు చెంతకు రిజర్వేషన్ల ఆర్డినెన్స్

- Advertisement -
- Advertisement -

ఆర్డినెన్స్‌పై గవర్నర్ నిర్ణయం కీలకం కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
ఆమోదం పొందిన వెంటనే ప్రభుత్వం జివో జారీకి సన్నాహం
మన తెలంగాణ/హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్టంలోని చిన్న క్లాజ్‌ను సవరించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశం నిర్ణయం మేరకు ఆర్డినెన్స్ తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంతకం చేసిన అనంతరం ఫైల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేసిన తర్వాత జిఏడి నుంచి ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్‌భవన్‌కు మంగళవారం చేరింది. దీంతో గవర్నర్ ఆమోదంతో పంచాయతీ, ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలకు వెళ్లేందుకు రిజర్వేషన్లు ఖరారు చేసి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వం ముందుకెళుతోంది.

2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (ఏ)కు సవరణ చేసేందుకు వీలుగా ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసి పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యమంత్రి అనుమతితో గవర్నర్‌కు ప్రభుత్వం పంపించింది. ఈ ముసాయిదా ఆమోదం పొందిన వెంటనే 42 శాతం రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో అమలు చేసేందుకు వీలు కల్పిస్తూ జీవో జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారం, పది రోజుల్లో ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోదం, తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయించడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
ఇదిలావుంటే ఆర్డినెన్స్‌కు ఎంత వరకు ఆమోదం లభిస్తుందని రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి వద్ద రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలియజేస్తారా..?లేదా అనే అంశంపై న్యాయకోవిదుల మధ్య ప్రస్తుతం చర్చజరుగుతోంది. ఒక వైపు ఆర్డినెన్స్‌తో గట్టెక్కాలనే ప్రభుత్వ వ్యూహం ఎంత వరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాల్సి ఉంది. కాగా ప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారుతో జివో జారీ చేసిన వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అనువుగా తీసుకు రావాలనుకున్న ఆర్డినెన్స్‌లో ముఖ్యంగా రెండు మూడు అంశాలను పొందుపర్చినట్లు సమాచారం.

వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనే కోణంలో స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ముందుకెళుతోందని పేర్కొనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకే రాష్ట్ర ఉభయ సభల్లో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించినట్లు తెలిపిందని సమాచారం. రాష్ట్రపతి వద్ద ఈ బిల్లు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత ఉన్న 2018 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285 (ఏ)కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు హైకోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన నేపధ్యంలో ఆర్డినెన్స్ అనివార్యమైనట్లు పేర్కొన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News