హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి మహిళలకు ఆర్టిసి (TGSRTC) బస్సుల్లో ప్రయాణించడం సులభతరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఒక్క మహిళ ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో మహిళలు రికార్డు స్థాయిలో ప్రయాణాలు చేశారు. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించగా.. అందులో 2.51 కోట్ల మంది ఉచితంగా ప్రయాణించినట్లు ఆర్టిసి ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ని ఆర్టిసి ఎండి సజ్జనార్ రీపోస్ట్ చేశారు.
రాఖీ పండగ (ఆగస్టు 9) నాడు 45.92 లక్షల మంది మహిళలు ఆర్టిసిలో (TGSRTC) ప్రయాణించారని.. ఆగస్టు 11న అత్యధికంగా 45.94 లక్షల మంది ప్రయాణించినట్లు ఆర్టిసి వెల్లడించింది. గత ఏడాది 2.75 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చామని.. గతేడాదితో పోలిస్తే 92.95లక్షల మంది ఎక్కువగా ఆర్టిసిలో ప్రయాణించాలరని పేర్కొంది. కాగా, ఆర్టిసి ఉచిత ప్రయాణ పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సోదర, సోదరీమణుల బంధం ఎంత గొప్పదో ఈ రాఖీ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేసిన అధికారులకి, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.