Wednesday, September 17, 2025

నాటి త్యాగధనుల పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

- Advertisement -
- Advertisement -

బస్‌భవన్‌లో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం
టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్

మనతెలంగాణ/హైదరాబాద్: నాటి త్యాగధనుల పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎండి సజ్జనార్ టిఎస్ ఆర్టీసి కేంద్ర కార్యాలయం, బస్‌భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నాడు సాగించిన ప్రజా సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను, నాటి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ సంకల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

దశాబ్దం క్రితం తాను వరంగల్, నల్గొండ, మెదక్‌లో పని చేసిన రోజుల్లో ప్రజలు నాటి రజాకర్ల దురాగతాల గురించి మాట్లాడుకునే వారని, అప్పట్లో నిజాం తూటాలకు బలైన మొదటి వీరుడు దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచిపోయారని ఆయన కీర్తించారు. ఈ పోరాట పటిమలో తెలంగాణ ప్రజలతో పాటు కళ్యాణ్ కర్ణాటక, మరాఠ్వాడ ప్రాంతాల ప్రజలు ఆదర్శంగా నిలిచారన్నారు. అలాంటి ప్రాంతాల సందర్శనలో భాగంగా రెండు దశాబ్ధాల క్రితం జనగాం ఎఎస్‌పిగా భైరాన్‌పల్లి గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడి ప్రజలు నాడు ఎదుర్కొన్న ఘటనలను తనకు వివరించారన్నారు. రజాకర్ల ఆకృత్యాలను, సామూహిక అత్యాచార సంఘటనలను తలచుకుని వారు ఎంతగానో బాధ పడ్డారని నాటి రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎ.ఎం, పి అండ్ ఎఎం) ఎస్.కృష్ణకాంత్, ఇడి (ఒ), సంస్థ కార్యదర్శి మునిశేఖర్, జాయింట్ డైరెక్టర్ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, సిఎఫ్‌ఎం శ్రీమతి విజయ పుష్ఫ, సిఈ (ఐటీ) రాజశేఖర్, సిటిఎం జీవన్ ప్రసాద్, సిపిఎం శ్రీమతి ఉషాదేవిలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News