ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదనే
సత్యవాక్కు అందరికీ తెలుసు
ఐనా ప్రయాస పడుతాం పరుగు ఆపం
ఎంత తత్వం బోధపడినా వెంపర్లాడుతాం
పరిపరి విధాలుగా ఇతరులను చదువుతాం
సుగుణాల మేళవింపు నేనే అంటాం
ఇతరులు దుఃఖిస్తే నవ్వుకుంటం
పక్కవాణ్ణి నిందించడం నిషిద్దం చేయం
కింద పడితే చెయ్యి ఇవ్వం
కొండ నాలుకతో నవ్వి కిలకిలమంటాం
కూసున్న కొమ్మను నరుక్కుంటాం
అంతా తెలిసొచ్చాక చేతులు కాల్చుకుంటాం
కాలం ఆగదనేది
నిత్యం కనుగొన్న మూలసూత్రం
సంతలో పిల్లాడు
చూపుడు వేలు విడిసి తప్పిపోతే
ఎంత ఆదుర్దానో అంత భయపడిపోతాం
కాలం లోగిలికో నిద్రపోతూ
కర్రును కొలిమిలో మండిస్తూ
మనిషితనం ఒక ఇరుకుతనం
క్షణకాలం సంతోషం
అనంతకాలం దాని కింద కాలాన్ని పొదిగేస్తం
పక్కవాడు పడిపోవాలనే లోపలి ఆశ
గెలిస్తే బావుండనే పై పై వెకిలి మాట
వేదిక మీద చిగురిస్తది
మనిషి అంతరంగం తెలిస్తే బాగుండును
ఆ పూటకు పక్కన బల్లెం ఎవరో తెలిసిపోయేది
రంగుల బట్టలేసుకుంటాం
లోపల లేనితనాన్ని పోగేసుకొని
పొడిపొడి మాటలతో
కాకి ఎద్దును పొడిసినట్లు ఉంటం
చివరికీ నేనే అన్నీ అని బిగుసుక్కుసుంటం
ఎదిగితే ఓర్వలేం
కొండ ఎక్కలేక పడిపోతాం
కొనజుట్లు పట్టుకొని వేలాడుతాం
నిర్దయగా ఇక్కడి నుండి విరమిస్తాం
ఫులిస్టాప్ లేని బతుకును
కాగితం మీద దిద్దుకుంటం
కామాలతో సరిపెట్టుకుంటం
ప్రశ్నలతో తలగోక్కుంటాం
చివరికి తలకిందులైందని
నెమరేసుకుంటం ఏవేవో!
అవనిశ్రీ