భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మపై(Rohit Sharma) సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డారిల్ కలినన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ చేసిందేమీ లేదని భారత జట్టులో రోహిత్ లేకపోతే వచ్చే సమస్యేమీ లేదని డారిల్ (Daryll Cullinan) అన్నారు. మే 7వ తేదీన రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అతని తర్వాత జట్టుకు కెప్టెన్సీ ఎవరు చేస్తారని.. అతని స్థానంలో జట్టులో ఎవరూ బ్యాటింగ్ చేస్తారని అనుకున్నారు. ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లభించలేదు.
అయితే తాజాగా డారిల్ కలినన్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్ అవుతాడని చాలా రోజులు గా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు. నిజానికైతే.. రోహిత్ టెస్ట్ కెరీర్ అంత గొప్పగా లేదు. భారత్ అయినా, విదేశాల్లో అయినా అతని ఆట తీరు ఒకేలా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ అతను ఘోరంగా విఫలమయ్యాడు. కాబట్టి రోహిత్ రిటైర్ అవ్వడం వల్ల భారత టెస్ట్ క్రికెట్‌కి వచ్చిన నష్టమేమీ లేదు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.