ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలరాంపూర్ జిల్లాలోని లోయలో గురువారం మధ్యాహ్నం బస్సు పడిపోగా ముగ్గురు మృతి చెందారని, 53 మందికి గాయాలయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. ఈ దుర్ఘటన చందో పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంతి ఘాట్‌లో జరిగింది. ఆ బస్సులో 70 మంది పెళ్లివారు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వారంతా శంకర్‌గఢ్ నుంచి పొరుగున ఉన్న జార్ఖండ్‌కు వెళుతుండగా ప్రమాదానికి గరయ్యారని ఆ పోలీస్ అధికారి తెలిపారు. ‘దుర్ఘటన విషయం తెలియగానే పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుంది.
ఓ మహిళ, పిల్లాడు సహా ముగ్గురు చనిపోయారు. కాగా 53 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బాలరాంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురిని సుర్‌గుజా జిల్లాలోని అంబికాపూర్‌లో ఉన్న మెడికల్ కాలేజ్‌కు రిఫర్ చేశారు’ అని ఆ పోలీస్ అధికారి తెలిపారు. చనిపోయిన వారిని బనేశ్వర్ తిర్కి(18), మహంతి కుజుర్(30), మమేశ్ బడా(13)గా గుర్తించారు. ఇదిలావుండగా బలరాంపూర్ కలెక్టర్ రాజేంద్ర కతర జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల్సింగా అక్కడి అధికారులను ఆదేశించారు.