Wednesday, August 20, 2025

ఎసిబి వలలో ముగ్గురు రెవెన్యూ అధికారులు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ముగ్గురు అధికారులు ఎసిబి వలలో చిక్కుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు తహసిల్దార్ కార్యాలయంలో హైదరాబాద్ జోన్-2 ఎసిబి డిఎస్‌పి శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఫిర్యాదుదారుడి పాస్‌బుక్కులో పేరు మార్పిడి (సవరణ) కోసం తహసిల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవిలను ఆశ్రయించాడు. మొదటగా రూ.50 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఆ డబ్బులు ఇచ్చినా సవరణ చేయకుండా తహసిల్దార్ సర్వేయర్ ఇద్దరూ కలిసి ఫిర్యాదుదారుడి నుంచి మరో లక్ష డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు.

బాధితుడి ఫిర్యాదే మేరకు అధికారులు ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేశారు. వారి సూచనల మేరకు బాధితుడు తహసిల్దార్, సర్వేయర్‌తో ఫోన్ సంభాషణ, కాల్ రికార్డుల ఆధారాలు సేకరించి, ఎసిబి అధికారులకు అందించాడు. తహసిల్దార్ కార్యాలయానికి అధికారులు అకస్మాత్తుగా చేరుకోని సోదాలు నిర్వహించి, రిజిస్ట్రేషన్లు, విరాసత్‌లు, భూములకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. తహసిల్దార్ లలిత, సర్వేయర్ రవిని అరెస్టు చేశారు. వారిద్దర్నీ హైదరాబాద్ ఎసిబి ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నట్లు ఎసిబి డిఎస్‌పి శ్రీధర్ తెలిపారు. ఎసిబి అధికారుల వెంట కందుకూరు ఆర్‌డిఒ జగదీశ్వర్‌రెడ్డి కూడా ఉన్నారు.

మరో సంఘటనలో వికారాబాద్ జిల్లా, తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎసిబి దాడులు జరిగాయి. రూ.15 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ బి.రమేష్ కుమార్ పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఎసిబి డిఎస్‌పి ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం…తాండూరు మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 26లో గల ప్లాట్ నెంబర్ 6లో ఉన్న రేకుల షెడ్డుకు ఇంటి నెంబర్ కేటాయించడం కోసం బాధితుడు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి నంబర్ కేటాయించాలంటే రూ,15 ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు సీనియర్ అసిస్టెంట్ రమేష్‌కు రూ.15 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్‌పై కేసు నమోదు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News