అతి వేగంతో కారు డిసిఎంను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగరాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం…. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూర్‌కు చెందిన పిన్నింటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు చంద్రసేనారెడ్డి (24) డిగ్రీ పూర్తి చేశాడు. చుంచు జంగారెడ్డి కుమారుడు చుంచు వర్శిత్‌రెడ్డి (23) విద్యార్థి, చుంచు శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు చుంచు త్రినాధ్‌రెడ్డి (24), ఎలిమినేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్‌రెడ్డి (24) నలుగురు కలిసి స్కోడా కారు ఎంహెచ్ 02 డిజి 0771లో మంగళవారం రాత్రి పెద్ద అంబర్‌పేట్‌లోని ఓ రిసెప్షన్‌కు వెళ్లారు. తిరిగి అక్కడి నుండి ఉప్పల్ నారపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వద్ద రాత్రి గడిపారు.
బుధవారం ఉదయం తెల్లవారు జామున నారపల్లి నుండి కుంట్లూర్‌కు ఇంటికి తిరుగు ప్రయాణంలో కుంట్లూర్ వద్ద అతి వేగంతో డిసిఎం టిఎస్ 07 యుకే 2664 కుంట్లూర్ నుండి పసుమాములకు వెళుతున్న డిసిఎంను కారు అతివేగంతో ఢీకొట్టడంతో కారులో ఉన్న చంద్రసేనా రెడ్డి, వర్శిత్‌రెడ్డి, త్రినాథ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన పవన్‌కళ్యాణ్‌రెడ్డిని హయత్‌నగర్ సన్‌రైజ్ అసపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వారసులను కోల్పోయిన మూడు కుటుంబాలు గుండె పగిలేలా రోదించడంతో అందరిని కంటతడి పెట్టించాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ హాజరై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి నివాళులు అర్పించారు.