జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. అవంతిపొరకు చెందిన థ్రాల్ ప్రాంతంలోని నదిర్‌లో ఈ ఎన్‌కౌటర్ మొదలయిందని, భద్రతాబలగాలు, పోలీసులు తమ విద్యుక్త ధర్మం నిర్వహిస్తున్నారని కశ్మీర్ జోన్ పోలీస్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది. గత 48 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్. నేటి ఉదయం థ్రాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ దృశ్యాలను డ్రోన్ చిత్రీకరించింది. అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. భద్రతా దళాలు జైషే ముహమ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను చుట్టుముట్టి హతమార్చాయి.
ఉగ్రవాదులు నదిర్ గ్రామంలో నకినట్టు సమాచారం అందడంతో భద్రతా దళాలు నిరంధ తనిఖీలు చేపట్టాయి. అప్పుడు ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టడంతో ఎన్‌కౌంటర్ మొదలయింది. హతమైన ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. వీరంతా జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే. నిన్న దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిని షహీద్ కుట్టా, అద్నాన్ షఫీగా గుర్తించారు. షహీద్ 2023లో లష్కరేలో చేరాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత షహీద్ ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి.