మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ టిప్పర్ వేగంగా దూసుకువచ్చి ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. టిప్పర్ రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకురావడంతో పాటు కారును ఢీకొట్టి కొద్ది దూరం వరకు లాక్కెళ్లింది. ఈ క్రమంలో కారు టిప్పర్ కింద చిక్కుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారి మృతదేహాలు తీవ్రంగా నుజ్జు నుజ్జయ్యాయి. ఆ కారు నెల్లూరు నుండి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకొని స్థాని కుల సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు. టిప్పర్ ఢీకొన్న ఘటనలో కారులోనే ఉండి చనిపోయిన వారి మృతదేహాల్ని వెలికి తీసేందుకు పోలీసుల తీవ్రంగా శ్రమించారు. ముంబై జాతీయ రహదారిగా పిలుచుకునే ఈ రోడ్డులో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎపి సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రమాదంపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆదేశాలు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన బుధవారం ఓ ప్రకటన ద్వారా స్పందించారు. ప్రమాదా నికి గల కారణాలను అధికారులు తనకు వివరించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రాష్ట్రంలో ఇసుక, కంకర రవాణా చేసే వాహనాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇసుక, కంకర తరలించే వాహనాలు మితిమీరిన వేగంతో, రాంగ్ రూట్లలో వెళుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాహనాలపై అధికా రులు కఠినంగా వ్యవహరించాలి‘ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన సూచించారు.
రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పందన
అటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలం టూ ఆదేశాలు ఇవ్వడంతో పాటు భద్రత చర్యలు చేపట్టాలని రవాణా అధికారులకు సూచనలు చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే సహించమని వారిని హెచ్చరించారు. సహాయక చర్యలు తీసుకోవాలని ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చారు. రహదారులపై నియమాల అమలు తప్పనిసరి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
అత్యంత విషాదకరం : వైఎస్ జగన్
వైసిపి అధినేత వైఎస్ జగన్ కూడా నెల్లూరు ప్రమాదం అత్యంత విషాద కరమని పేర్కొన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలి పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also Read: పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం: రేవంత్